గుర్రంపోడు, ఏప్రిల్ 13 : రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్రంపోడు ఎస్ఐ ఎన్.వెంకన్న అన్నారు. సోమవారం మండలంలోని పాల్వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో “అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు చాలా వరకు నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన లోపం వల్లే జరుగుతున్నాయన్నారు. కావునా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, ముఖ్యంగా హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. యువత అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రాణ నష్టం జరుగుతోందని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా శిక్షార్హమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా వాహనదారులు తమ వాహన పత్రాలు సక్రమంగా కలిగి ఉండాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయకూడదన్నారు. పాఠశాలలు, కళాశాలలో, యువతకు, గ్రామాలలో గ్రామస్థాయి రోడ్డు సేఫ్టీ కమిటీల సహకారంతో రోడ్డు భద్రతపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ ఎన్.కరుణశ్రీ, ఏఓ కంచర్ల మాధవరెడ్డి, హెచ్ఎం విజయలక్ష్మీ, స్థానిక సర్పంచ్ బైరెడ్డి సత్యనారాయణ, ఉప సర్పంచ్ మంచికంటి ప్రసాద్, పంచాయితీ కార్యదర్శి సైదులు, స్థానికులు, ఆటో, ఇతర వాహనదారులు పాల్గొన్నారు.