కొండమల్లేపల్లి, ఏప్రిల్ 10: ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు కీలకమైన సేవలు అందిస్తున్న విద్యుత్ కార్మికులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, అలాంటి వారిని రేవంత్ సర్కార్ విస్మరించడం సరికాదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం కొండమల్లేపల్లిలోని డీఈ కార్యాలయం ఎదు ట కొనసాగుతున్న విద్యుత్ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం 26 వేల మందిని ఆర్టిజన్లుగా గుర్తించిందని, ప్రభుత్వం అలవెన్స్‌లు వచ్చేలా 90 శాతం సమస్యలు పరిష్కరించారని గుర్తు చేశారు. ఎస్పీడీసీఎల్, జెన్కో పరిధిలో పని చేస్తున్న అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని కోరారు. కరెంట్ సరిగా రాక పంటలు ఎండిపోతున్నాయని, పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దావురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్రలో అధికారంలోకి రాగానే అన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి, రెండున్నరేండ్లు కావస్తున్నా సమస్యలు పరిష్కరించకుండా మాట తప్పారన్నారు. అందుకే విద్యుత్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారన్నారు. ప్రస్తుతం విద్యుత్ అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరమని, అరగంట విద్యుత్ పోతే తట్టుకోవడం కష్టమవుతుందని అన్నారు. ఎక్కువ రోజులు కార్మికులు సమ్మె చేస్తే కలిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
విద్యుత్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెకు సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలిమ్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నల్లా వెంకటయ్య, సీఐటీయూ సీనియర్ నాయకులు యాదగిరి విద్యుత్ కార్మికులకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు టీవీఎన్‌రెడ్డి, సర్పంచులు రమావత్ దీప్‌లాల్‌నాయక్, జబ్బు జంగమ్మయాదయ్య, విద్యుత్ కార్మికులు దాసరి యాదయ్య, రమేశ్‌రెడ్డి, పగిళ్ల యాదయ్య, పంతంగి శంకర్, తిరుపతి కూమార్, సర్వర్ హుస్సేన్, దస్రూనాయక్ తదితరులు పాల్గొన్నారు.