– ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్న పలివెల హై స్కూల్ విద్యార్థులు
– గత మూడు నెలలుగా తెలుగు ఉపాధ్యాయలు లేని వైనం
– ఏఐఎస్ఎఫ్ మునుగోడు మండలాధ్యక్షుడు గోపగోని ఉదయ్
మునుగోడు, జనవరి 27 : మునుగోడు మండలంలోని పలివెల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత మూడు నెలలుగా తెలుగు ఉపాధ్యాయులు లేకపోవడం అత్యంత బాధాకరమని అఖిల భారత విద్యార్థి సంఘం (AISF) మండలాధ్యక్షుడు గోపగోని ఉదయ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయడం విద్యాశాఖ వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న ఈ కీలక సమయంలో కూడా ఉపాధ్యాయులను నియమించకపోవడం వల్ల సిలబస్ పూర్తి కాకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. విద్యా హక్కును కాపాడాల్సిన ప్రభుత్వం, బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కావునా సంబంధిత విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి పలివెల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులను వార్షిక పరీక్షలకు పూర్తి స్థాయిలో సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.