సూర్యాపేట, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : వరంగల్ జిల్లా వేదికగా జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రను తిరగరాయబోతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నేడు అన్ని రంగాల నోట కేసీఆర్ మాటే వినిపిస్తున్నదని, పదేండ్ల ఆయన పాలనలో అందిన ఫలాలనే అంతా గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ నిజమైన సైనికులుగా ఊళ్లకు ఊళ్లను కలుపుకొని ఈ నెల 27న రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు.
బహిరంగ సభ నేపథ్యంలో సూర్యాపేటలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో సూర్యాపేట నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభించలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో మొదటి మడి కోయడానికి ముందే మొదలుపెట్టి చివరి గింజ వరకూ కొనుగోలు చేశామని గుర్తుచేశారు. నాడు కొనుగోలు కేంద్రాలకు లారీ రాకపోతే తనకు ఫోన్లు వచ్చేవని, ఇప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు అలా ఫోన్లు చేసే వారు లేరు… ఎత్తేవారు లేరని పేర్కొన్నారు. అందుకే ప్రతి రైతుకూ కేసీఆర్ గుర్తుకు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క శాఖ కూడా సరిగ్గా పని చేయడం లేదని విమర్శించారు. పని చేసే శాఖ ఎదైనా ఉందంటే అది పోలీస్ శాఖనేనని ఎద్దేవా చేశారు.
మరోవైపు ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం, రైతులు, నిరుద్యోగులు, యువతీయువకులపై అక్రమ కేసులు బనాయిస్తూ పోలీస్ శాఖనే కాంగ్రెస్‌ను బొంద పెట్టే పనిలో విజయవంతంగా పని చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ సర్కారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వాటిని కూడా కొనసాగించడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనను ప్రజలు అర్ధ్దం చేసుకున్నారని, గులాబీ జెండానే తమబలమని తెలుసుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టి పంట వేసింది మొదలు అమ్ముకునే వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేశారని, నేడు రైతుబిడ్డలమంటూ చెప్పుకొంటున్న మంత్రులు రైతు భూములను గుంజుకోవడం తప్ప మరోకటి చేయడం లేదని దుయ్యబట్టారు.
వెనకటికి గ్రామాల్లో లత్కోర్ సాబ్ ఉండేవాడని, నేడు ఆయన లేని లోటును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీర్చిండని ప్రజలు గుర్తు చేసుకునే పరిస్థితికి రేవంత్‌రెడ్డి వచ్చాడని పేర్కొన్నారు. ప్రజలకు చెప్పే మాటలో అక్షరం తప్పున్నా కేసీఆర్‌కు కోపం వచ్చేదని, చేయగలిగిందే చెప్పాలి.. చెప్పింది చేయాలని చెప్పేవారని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు తీరుతో విసుగెత్తిన ప్రజలు ఇంకా మూడున్నరేండ్లు వీళ్లే ఉంటారా? వీళ్లను భరించాలా.. కేసీఆర్‌కు చెప్పి ఏదైనా చేయడంటూ తమతో చెబుతున్నారని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతితో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఆ ప్రజలే కూలగొట్టమంటున్నారంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉందో అర్ధం చేసుకోవాలన్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన రోజు పోలీసులు కాదు.. మిలటరీ వచ్చి అడ్డుపడ్డా ఏ ప్రభుత్వమూ మనుగడ సాగిందని లేదని హెచ్చరించారు. ప్రజా చైతన్యానికి తగ్గట్టు నాయకత్వం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టకిశోర్, మొరిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 14 : ఆత్మకూర్.ఎస్ మండలం మంగలితండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాదాపు 150మంది ఆ పార్టీని వీడి మూకుమ్మడిగా బీఆర్ఎస్లోకి చేరారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం అనంతరం మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారిలో లునావత్ నాగరాజు, అమ్రునాయక్, కోక్యానాయక్, బీమ్లా, లింగయ్య, పూలమ్మ, గణేశ్, నాగ, బుజ్జి, సువారి, సోర్ని, సోనా, జగ్రు, బిక్యా ఉన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నేరెళ్ల వెంకన్న, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ధనసింగ్, కందగట్ల గ్రామ శాఖ అధ్యక్షుడు రవిందర్‌రెడ్డి, పోషణపెల్లి రాజశేఖర్, బాలాజీనాయక్ ఉన్నారు.