మునుగోడు, ఏప్రిల్ 16 : గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం.నాగమణి అన్నారు. పోషణ పక్షంలో భాగంగా బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మునుగోడు మండలం కొరటికల్ గ్రామ పంచాయతీ ఆవరణలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న రాగి జావా, పల్లి పట్టి, నువ్వుల లడ్డు, చిరుధాన్యా లతో చేసిన లడ్డు, బెల్లంతో తయారు చేసిన పరమాన్నం. మునగాకు, కరివేపాకు కారంపొడి మొదలగు ఆహార పదార్థాలు ఎలా తయారు చేసుకుని తీసుకోవాలో వివరించారు.
రక్తహీనతకు గురి కాకుండా ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టరు అయేషా ఫాతిమా, ఏఎన్ఎం సీహెచ్ పద్మ, ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుడు కాశీరాం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు సుజాత, అండాలు, యాదమ్మ పాల్గొన్నారు.