నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్10(నమస్తే తెలంగాణ) : కనీస వేతనాలు చెల్లించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్ల యూనియన్ మంగళవారం చలో హైదరాబాద్కు పిలుపునివ్వగా, పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కొద్దిరోజులుగా దశల వారీగా ఆందోళన చేస్తున్న ఆశ వర్కర్లు పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసులు వారిని సీఐటీయూ నాయకులతోపాటు ముందస్తుగా అరెస్టు చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఒక్కరు కూడా చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. దాంతో ఆయా మండలాల వారీగా యూనియన్ నేతలను, వారి ద్వారా ఇతరుల సమాచారాన్ని సేకరించి ఇండ్ల వద్దే అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ మండలాల్లోని స్థానిక పోలీసు స్టేషన్లలో మధ్యాహ్నం వరకు ఉంచి సాయంత్రం వదిలి పెట్టారు. నల్లగొండ, తిప్పర్తి, మాడ్గులపల్లి, మిర్యాలగూడ, మునుగోడు, కట్టంగూరు, దామరచర్ల, త్రిపురారం, హాలియా, చండూరు, కేతేపల్లి, కనగల్, నార్కట్పల్లి, దేవరకొండ, నకిరేకల్, చిట్యాల, నిడమనూరు, గుర్రంపోడు ఇలా దాదాపు అన్ని మండలాల్లో ఆశ వర్కర్లపై పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. ఆశ వర్కర్ల అక్రమ అరెస్టులను సీఐటీయూ నేతలు తీవ్రంగా ఖండించారు.
ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే ఆశ వర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ నేతలు హామీలు ఇచ్చి, ఇప్పుడు గద్దెనెక్కాక పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు వెంటనే ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో దీర్ఘాకాలిక పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు.