పెన్పహాడ్, నవంబర్ 06 : సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామంలో నిర్మించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో మొదటి రోజు సాయంత్రం 6 గంటల నుండి విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, ఋత్విక వరణము, రక్షాబంధనం, మత్సంగ్రహణం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం. యాగశాలలో ద్వారతోరణ, ధ్వజకుంభ ఆరాధన, మహాకుంభ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, వాస్తు హోమం, పర్యగ్నీకరణము, పంచగవ్యస్నము, రక్ష బంధనం, మత్సం గ్రహనం, అంకురార్పణ తదితర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. మూర్తి, కుంభాభిషేకం, విమాన, ధ్వజస్తంభ ప్రతిష్ఠను చేపట్టనున్నారు.
సామ బుచ్చిరెడ్డి కుమారుడు రిందాకుమార్ రెడ్డి, కుమార్తె విజయలక్ష్మి, భాను వసంతరెడ్డితో పాటు గ్రామస్తుల సహకారంతో రూ.1.20 కోట్లతో, స్థల దాతలు తడకమల్ల వంశస్థులు విరాళంగా ఇచ్చిన స్థలంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. పూజాది కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Penpahad : రేపటి నుండి ప్రసన్న వేంకటేశ్వర ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు