సూర్యాపేట, జూన్ 09 : ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అందుకు అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నాలుమూలల నుంచి వచ్చిన 64 మంది తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడమే ఉద్యోగుల బాధ్యత అన్నారు. అధికారులు నిత్యం వారికి అందుబాటులో ఉండి పని చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి విధులు, రిజిస్టర్ల నిర్వహణ, ఫైల్స్ సరైన పద్దతిలో నిర్వహించేందుకు దిశా నిర్థేశం చేయాలని చెప్పారు. భూ సమస్యలకి సంబంధించిన దరఖాస్తులు సమర్పించేందుకు జిల్లా స్థాయి ప్రజావాణికి రావాల్సిన అవసరం లేదని తెలిపారు. జూన్ 20 వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ అధికారులచే రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. భూ సమస్యలు ఏమైన ఉంటే ఆయా గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సుల్లో అన్ని డాక్యూమెంట్స్ జత చేసి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీఓ అప్పారావు, డీఈఓ అశోక్, డీపీఓ యాదగిరి,, సీపీఓ కిషన్, డీడబ్ల్యూఓ నరసింహరావు, డీసీఓ పద్మ, డీఏఓ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.