నకిరేకల్, జూన్ 22 : రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు పుట్టని మాట వాస్తవమేనని, తల తాకట్టు పెట్టయినా మూడున్నరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని, ఆ తరువాతే ప్రతి ఇంటికీ వచ్చి ఓట్లు అడుగుతామని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శపథం చేశారు. ఆదివారం నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని మినీస్టేడియంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇండ్లు, మూడున్నర ఏళ్లల్లో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి అవసరమైతే నిబంధనలు సడలించాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో రాజకీయ జోక్యం లేదన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నకిరేకల్, రామన్నపేట మండలాలకు తహసీల్దార్ కార్యాలయాల భవనాలు మంజూరు చేయాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెలికంటి సత్యం, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్‌కుమార్, మందుల సామేల్, శాసనమండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవో అశోక్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, జెడ్పీసీ ఈవో శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, తహసీల్దార్ జమీరొద్దీన్, ప్రత్యేకాధికారి కిరణ్‌కుమార్, ఎంపీడీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.