నల్లగొండ ప్రతినిధి, మే13(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో సోమవారం ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. నడి వేసవిలో సైతం ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో పోలింగ్ రోజున వాతావరణం చల్లబడింది. దాంతో ఉత్సాహంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తడంతో భారీగా పోలింగ్ నమోదైంది. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికలతో పోల్చుకుంటే గణనీయంగా పోలింగ్ పెరిగినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. నల్లగొండ పార్లమెంట్ స్థానంలో మొత్తం 17,26,204 మంది ఓటర్లు ఉండగా… వారిలో 73.95 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలో మొత్తం 18,09,241 మంది ఓటర్లలో 76.47 శాతం ఓట్లు నమోదయ్యాయి. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గినా 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే మాత్రం పోలింగ్ శాతం పెరుగడం విశేషం. ఎమ్మెల్యే ఎన్నికల అంత సీరియస్‌గా ఈ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు గానీ, ఓటర్లు గానీ తీసుకున్నట్లు కనిపించలేదు. దాంతో ఆ ప్రభావం పోలింగ్ పడిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలు సందడిగానే కనిపించాయి. మధ్యలో ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు కొంత ఓటర్ల రాక మందగించింది. అందరు ఊహించినట్లుగా ఎండవేడిమి అంతగా లేకపోవడంతో ఓటర్లు ఊపిరి పీల్చుకున్నారు.
నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఉండవచ్చని భావిస్తూ ఓటర్లు చల్లని పూటనే ఎక్కువగా తరలివచ్చారు. దాంతో పోలింగ్ కూడా భారీగానే నమోదైంది. ఉదయం 7నుంచి 9గంటల వరకు నల్లగొండ స్థానంలో 12.80శాతం, భువనగిరిలో 10.54శాతం పోలింగ్ నమోదైంది. 11గంటల వరకు నల్లగొండలో 31.21శాతం, భువనగిరిలో 27.97శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు నల్లగొండలో 48.48శాతం, భువనగిరిలో 46.49శాతం, మూడు గంటల వరకు నల్లగొండలో 59.91శాతం, భువనగిరిలో 62.05శాతం, సాయంత్రం 5గంటల వరకు నల్లగొండలో 70.36శాతం, భువనగిరిలో 72.34శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉత్సాహంగా వచ్చిన ఓటర్లు మధ్యలో కొద్దిసేపు వెనక్కి తగ్గారు. తిరిగి 4గంటల నుంచి మిగిలిన ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. చాలాచోట్ల సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి ఓటర్లు బారులు తీరి కనిపించారు. దాంతో ఆరు గంటలకు కేంద్రాల గేట్లు మూసేసిన అధికారులు అప్పటికే లోపల ఉన్న ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. తుది ఓటింగ్ నల్లగొండలో 73.95 భువనగిరిలో 76.47 శాతంగా నమోదైంది. అక్కడక్కడా కొద్దిసేపు ఈవీఎంలు మొరాయించడం మినహా చెదురుమదురు ఘటనలు కూడా చోటుచేసుకోలేదు. పలుచోట్ల మహిళలు, దివ్వాంగులు, యువతతో ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. నల్లగొండలో మొత్తం 17,26,204 మంది ఓటర్లు ఉండగా 2,061 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. భువనగిరిలో 18,09,241 మంది ఓటర్లు, 2,141 పోలింగ్ కేంద్రాలు, 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగగా.. పలుచోట్ల ఆరు గంటల తర్వాత కూడా ఓటర్లు క్యూలైన్లలో వేచి ఉండి చైతన్యాన్ని చాటిచెప్పారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూత్‌లో ఉన్న ఓటర్లు ఎంత సమయమైనా ఓటు వేయించాల్సి ఉన్నందున రాత్రి చివరి ఓటరు వరకు అధికారులు పోలింగ్ నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలు, వీవీ ప్యాట్లను భారీ పోలీసు భద్రత నడుమ ముందుగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోని రిసెప్షన్ కేంద్రాలకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి నల్లగొండ స్థానానికి సంబంధించి నల్లగొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లోని స్ట్రాంగ్‌రూములకు తరలించారు. భువనగిరికి సంబంధించిన ఈవీఎంలను అరోరా ఇంజినీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఈవీఎంలన్నీ చేరాక అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో రూమ్‌కు సీల్ చేయనున్నారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ బందోబస్తుతో నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో భద్రత చర్యలు చేపట్టారు.
వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ రోజు ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తర్వాత రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో హాల్ కేటాయించి అందులో ఒక్కో రౌండ్లో 14 టేబుళ్లపై 14 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఇలా ఏకకాలంలో ఏడు హాళ్లల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓట్లను లెక్కిస్తూ అన్ని కలిపి రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తారు. ఉదయం 10 గంటల వరకు ఫలితాల సరళి వెల్లడి కానుండగా మధ్యాహ్నం మూడు గంట వరకే మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుందని అంచనా.