భూదాన్‌పోచంపల్లి, మే 7 : హైదరాబాద్ వేదికగా ఈ నెల ఏడో తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే పలు దేశాలకు చెందిన సుందరీమణులు చేనేతకు ప్రసిద్ధి చెందిన గ్రామీణ పర్యాటక కేంద్రం భూదాన్ పోచంపల్లికి రానున్నారు. ఈ నెల 15న వారి రాక కోసం పోచంపల్లిలోని టూరిజం పారును ముస్తాబు చేస్తున్నారు. పది రోజులుగా పారులోని ఇంటీరియర్‌తోపాటు బయటి ప్రాంగణమంతా రంగులువేస్తూ సుందరీకరిస్తున్నారు. మ్యూజియం, హంపి థియేటర్, గెస్ట్ రూములను అలంకరిస్తున్నారు. పచ్చదనంతో కూడిన లాన్స్, ప్రకృతి అందాలు ఇనుమడింపజేసేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. అందాల భామలకు చేనేత థీమ్స్ ప్రతిబింబించేలా అధికారులు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.
చేనేత మ్యూజియంలో గోడలకు పోచంపల్లి ఇకత్, సిద్దిపేట, గొల్లభామ, నారాయణపేట, గద్వాల వస్త్రాలతో అలంకరించనున్నారు. టూరిజం ప్రాంగణంలో చేనేత వస్త్రాల తయారీ విధానాలు లైవ్ డెమోన్స్ట్రేషన్తోపాటు, చేనేత ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్థానిక మహిళలు అందాల భామలకు ఘన స్వాగతం పలికేలా, హంపి థియేటర్ వద్ద చేనేత కార్మికులతో ముఖాముఖి, అందాల భామలు చేనేత వస్త్రాలు ధరించి రాంప్ వాక్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15న సాయంత్రం 6 నుంచి 8:30 గంటల వరకు కార్యక్రమాలు జరుగనుండగా, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్, పోచంపల్లి మిస్ వరల్డ్ ప్రోగ్రాం ఇన్చార్జి డాక్టర్ కె. లక్ష్మి, టూరిజం శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్‌రెడ్డి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందాల భామల రాక కోసం భారీ బందోబస్తు నిర్వహించనున్నట్లు చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, చౌటుప్పల్ సీఐ రాములు తెలిపారు.