నీలగిరి, ఫిబ్రవరి 02 : మున్సిపల్ ఎన్నికల విధులను పీఓ, ఏపీఓలు సమర్థవంతంగా నిర్వర్తించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదీత్య భవన్లో మున్సిపల్ ఎన్నికల పీఓ, ఏపీఓలకు ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఇచ్చే మెటీరియల్, బ్యాలెట్ బాక్స్ ల సీలింగ్ ప్రిసైడింగ్ అధికారుల డైరీ, బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులను తెరవడం, తర్వాత ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ చేయడం తదితర అంశాలపై కలెక్టర్ పీఓ, ఏపీఓలకు వివరించారు. పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లను గుంపులు గుంపులుగా అనుమతించకుండా క్యూ పద్ధతిలో వరుస క్రమంలో వచ్చే విధంగా పంపించాలని చెప్పారు.
ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం టీ పోల్ లో అప్లోడ్ చేయాలని, పోలింగ్ కేంద్రంలోకి వాటర్ బాటిళ్లు, బ్యాగ్, మొబైల్, ఇంక్ ప్యాడ్ వంటివి అనుమతించవద్దని, మీడియా ప్రతినిధులకు పోలింగ్ కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.100 మీటర్ల అవతల వెహికల్స్ పార్కింగ్ చేసుకోవాలని, పోలింగ్ కేంద్రం వద్ద మెడికల్ టీమ్స్, వీల్ చైర్, అంగన్వాడీల సహాయకులు ఉంటారని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి మున్సిపల్ ఎన్నికల జిల్లా పరిశీలకులు, రాష్ట్ర ఎస్ సి ఈ ఆర్ టి సంచాలకులు జి.రమేష్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, డిఈఓ భిక్షపతి, ట్రైనింగ్ నోడల్ అధికారి, చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ద్వారాక్, మాస్టర్ ట్రైనర్లు హాజరయ్యారు.

Municipal Elections : పీఓ, ఏపీఓలు సమర్థవంతంగా విధులు నిర్వహించాలి : కలెక్టర్ బి.చంద్రశేఖర్