వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 02 : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఫెంగల్ తుఫాను, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఉద్యాన పంటల్లో తగు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని పూలు, కూరగాయల విభాగం శాస్త్రవేత్తలు సూచించారు. కూరగాయల విభాగం హెడ్ డాక్టర్ అనిత, పూల పరిశోధనా విభాగం హెడ్ డాక్టర్ గద్దె జ్యోతి ఈ కింది సూచనలు చేశారు.
బంతి : రబీలో నాటిన పంటకు 30 రోజులకు తలను తుంచి వేయాలి. ఆకు తినే పురుగుల నివారణకు క్లోరోఫైరీపాస్ 2 మిల్లీలీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
గులాబీ : కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. ఆకులు తినే మిడతల నివారణకు వేప కషాయం 5 మిల్లీలీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగు నివారణకు స్పైనోసాడ్ 0.3 మిలీలీటర్లను లీటర్ నీటిలో కలిపి స్పే చేయాలి. బూడిద తెగుళ్ల నివారణకు హెక్సాకొనజోల్ 2మి.లీ. లేదా, నీటిలో కరిగే గంధకం 2.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పూలను ఉదయం, సాయంత్రం మాత్రమే తెంచాలి.
చామంతి : ప్రస్తుతం చామంతి పూత దశలో ఉంది. అధికంగా ఉన్న పక్క కొమ్మలను, మొగ్గలను తుంచేయాలి. పక్కన వచ్చిన పిలకలను తీసివేయాలి. బూడిద తెగుళ్లు కనిపిస్తే నీటిలో కరిగే గంధకం 2.5 గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పువ్వు కుళ్లు నివారణకు కార్బండైజిమ్ గ్రామును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మల్లె : మొక్కల్లో కొమ్మ కత్తిరింపులు, ఆకులు రాల్పి కొమ్మలను దగ్గరగా కట్టాలి. మొక్కలకు నీటి తడులు, ఎరువులను నెల వరకు వేయకకూడదు. కొత్త ఇగుళ్లు ప్రారంభమైన తర్వాత నీటి తడులు ఇవ్వాలి. ఆకుమచ్చ, బూడిద, బూజుతెగుళ్ల నివారణకు కార్బండైజియం, మాంకోజెబ్ 2.5 గ్రాములను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కాయతొలుచు పురుగు నివారణకు : నొవాల్యూరాన్ 0.75 మిల్లీలీటర్లను లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా, ఆకు మచ్చ తెగుళ్లు, కొనోఫోరా, ఎండు తెగుళ్ల నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్0. 3గ్రాములు, ప్లాంటమైసిన్ గ్రాము కలిపి తగు మోతాదు నీటితో కలిపి పిచికారీ చేయాలి. కాయ కుళ్లు, పక్షి కన్ను తెగుళ్ల నివారణకు ప్రొఫికోనైజోల్ 1 మిల్లీలీటర్ను లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
కూరగాయలు : టమాట, వంకాయ, ఉల్లి, బెండ, తీగజాతి కూరగాయల పొలాల్లో నిలిచిన నీటిని తీసివేయాలి. మొక్కలకు మట్టిని ఎగదొయ్యాలి. నిటారుగా పెరిగే మొక్కలకు వూతమివ్వాలి. పది రోజుల వ్యవధిలో రెండు సార్లు యూరియా ద్రావణం పిచికారీ చేయాలి. చనిపోయిన మొక్కలను తీసివేసి ఆ ప్రదేశంలో మళ్లీ విత్తడం లేదా నాటడడం చేపట్టాలి. కలుపు నివారణకు అంతర కృషి చర్యలు తీసుకోవాలి. 19.19.19 తగు మోతాదు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మిరపకు 10గ్రాముల యూరియా , చక్కెర, లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాలి. మొక్కలు ఎక్కువ కాలం నీటిలో మునిగినైట్లెతే మెగ్నీషియం సల్ఫేట్ 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఇనుము ధాతు లోపం కనిపించినట్లయితే 50 గ్రాముల అన్నబేది, 10గ్రాముల నిమ్మ ఉప్పు 10లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి.