గట్టుప్పల్, జూన్ 18 : గట్టుప్పల్ సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. బుధవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్థానిక నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన పదవీ త్యాగంతో ఏర్పడిన గట్టుప్పల్ మండల కేంద్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. పుట్టపాక రోడ్డు నుండి సెంటర్ గుండా పోలీస్ స్టేషన్ వరకు, అక్కడినుండి నామాపురం తెరట్టుపల్లి రోడ్డు వరకు, నారాయణపురం మండల కేంద్రం నుండి గట్టుప్పల్ మండల కేంద్రం వరకు రోడ్డు విస్తరణ పనులు, గట్టుప్పల్ మండల కేంద్రంలో రోడ్డును విస్తరించాలన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిలిచిపోయిన తరగతి గదుల భవన నిర్మాణాలను, వంటగది నిర్మాణాలను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమయ్యే మౌలిక వసతులను కల్పించే విధంగా భవన నిర్మాణాలు చేపడతామన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిర ఇండ్లు మంజూరు చేపిస్తామన్నారు. మండల కేంద్రంలో అన్ని శాఖల కార్యాలయాలు విధులు నిర్వహించే విధంగా ఇప్పటికే ఉన్నతాధికారులతో పలుమార్లు మాట్లాడినట్లు తెలిపారు. త్వరలోనే ఇక్కడి పోలీస్ స్టేషన్కు ఎఫ్ఐఆర్ అథారిటీ వస్తుందన్నారు. త్వరలోనే అధికారులతో కూర్చుని మండల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, ఆ ప్లాన్ ప్రకారం గట్టుప్పల్ మండలం అభివృద్ధి చేసుకుందామని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జితేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు నామిని జగన్నాథం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.