రామగిరి, మే 7 : బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు పదో తరగతి వార్షిక పరీక్షల ముందు నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కేజీబీవీ విద్యార్థినులకు ఓ హామీ ఇచ్చారు. టెన్త్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిని తన సొంత ఖర్చులతో విమానంలో పంపిస్తానని ప్రకటించారు. పదో తరగతి ఫలితాల్లో మాడ్గులపల్లి కేజీబీవీ విద్యార్థిని ప్రసన్న 600 మార్కులకుగానూ 563 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు కలెక్టర్ త్రిపాఠి బుధవారం తన కార్యాలయానికి ప్రసన్నతోపాటు మాడ్గులపల్లి కేజీబీవీ ఎస్ఓ కె.సునీతను పిలిపించారు. ఈ నెల 17న ప్రసన్న, సునీత ఇద్దరిని తన సొంత ఖర్చులతో విమానంలో విశాఖపట్నం పంపించి ఈ నెల 19వరకు అక్కడే గడిపేలా ఏర్పాట్లు చేశారు. దీంతో వారు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ రాజ్‌కుమార్, డీఈఓ బి.భిక్షపతి ఉన్నారు.