యాదాద్రి భువనగిరి, మే 4 (నమస్తే తెలంగాణ) : భూదాన్‌పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెంలో పలు రసాయన కంపెనీల నుంచి వెలువడే విషవాయువులు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారాయి. అధికారుల అలసత్వం, పెద్దల అండతో ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా ఈ కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. ఈ కంపెనీలు ప్రమాదకరమైన విషవాయువులను వెదజల్లుతున్నాయి. పీసీబీ అధికారులు ఈ సమస్యను గుర్తించినా ఇప్పటి వరకూ ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈవిషయంపై అంతమ్మ గూడెం ప్రజలు ప్రజావాణిలో కలెక్టర్ అనురాగ్ జయంతికి తమ గోడు వెల్లబోసుకున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫాస్జీన్ వాయువు అత్యంత విషపూరితమైనది. వాసన తక్కువగా ఉండటం వల్ల దీనిని సైలెంట్ కిల్లర్‌గా పరిగణిస్తారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మనుషులను చంపేందుకు దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించారంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే అంతమ్మగూడెంలోని ‘హజేలో’ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ యజమాన్యం తీవ్రమైన వాయు, నీరు, భూమి కాలుష్యానికి పాల్పడుతోంది. దీని నుంచి వచ్చే వ్యర్థ వాయువుల వాసనను స్థానికులు భరించలేకపోతున్నారు. గతేడాది నిర్వహించిన పరీక్షల్లో గ్రామస్తులు పీల్చేగాలిలో ఫాస్జీన్, బెంజిన్, ఇథైల్ బెంజిన్, టోలిన్, ఆర్థోైక్లెలీన్, ఎసిటోన్, డైక్లోరోమిథైన్, డైమిథైల్ ఫార్మా మైడ్, నాప్తాలీన్ తదితర ప్రమాదకర రసాయనాలు చేరాయని గుర్తించారు.
పరిశ్రమల సమీపంలో కాలుష్యం కారణంగా మట్టి పూర్తిగా కలుషితమైంది. 9 నుంచి 20 ఫీట్ల భూమి కింది భాగంలో పూర్తిగా రసాయనాలతో నిండి ఉంది. ఈ పరిశ్రమ గతంలో గతంలో కూడా అనేక సార్లు కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించడంతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండల నుంచి క్లోజర్ ఆర్డర్, స్టాఫ్ ప్రొడక్షన్ ఆదేశాలు వచ్చినా ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకునేవారే లేరు.
పలు ఫిర్యాదుల మేరకు పీసీబీ అధికారులు 70 రోజు ల్లో 18 సార్లు తనిఖీలు చేపట్టారు. వారానికి రెండు రోజులు తనిఖీలు చేపడుతున్నా సమస్యను పరిష్కరించడంలేదు. పరిశ్రమలో నల్లగొండ పీసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి నిబంధనలు పాటించలేదని, కాలుష్యానికి పాల్పడుతున్నారని ఈ ఏడాది మార్చి 13న ఇచ్చిన నివేదికలో ధ్రువీకరించారు. ఆ నివేదిక ప్రకారం.. పరిశ్రమలో ఉన్న వీవోసీ మీటర్ విలువలు 0 నుంచి 3 పీపీఎం వరకే చూపిస్తున్నప్పటికీ.. వాస్తవ పరీక్షలో 110 పీపీఎం వరకు విలువలు నమోదయ్యాయి. వీవో సీ విలువ 110 పీపీఎం స్థాయిలో ఉన్న గాలి తీవ్ర ప్రమాదకరమైంది. కళ్లు, ముక్కు, గొంతు వ్యాధు లు, తలనొప్పి, వాంతులు, నాడీ సంబంధిత సమస్యలు, కాలేయం, మూత్రపిండాలతోపాటు కేన్స ర్ వంటి వ్యాధులకు దారితీస్తుంది.
పరిశ్రమలోని ప్రొడక్షన్ బాక్స్‌లో రియాక్టర్లు పనిచేస్తున్నప్పటికీ స్క్రబ్బర్లు పనిచేయడంలేదు. ఇవి లేకపోవడం వల్ల హానికారక వాయువులు నేరుగా వాతావరణంలోకి వెళ్తాయి. పరిశ్రమలో గ్యానైన్, 2-ఎసిటైల్ మెథాక్సీ ఈథర్ లాంటి రసాయనాలను తయా రు చేస్తున్నది. పరిశ్రమలో అనుమతి లేకుండా ట్రైఫాస్జిన్, అనైడోస్ అల్యూమీని యం క్లోరైడ్ రసాయనాలు నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. హజేలో కంపెనీతోపాటు బృందావన్ ల్యాబరేటరీస్, శ్రీ జయ ల్యాబరేటరీస్, వినీత్ ల్యాబరేటరీస్, కెమిక్ లైఫ్ సైన్స్, ఆప్టిమస్, వీఏ సాయి, ఎస్వీఆర్ లేబోరేటరీస్, ఆర్కిమెడీస్, రావుస్, ఎస్వీఆర్ ట్రేడర్స్ పరిశ్రమలు విడుదల చేస్తున్న కాలుష్యంతో గ్రామస్తులు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు.
హెజోలే పరిశ్రమ నుంచి విషవాయువులు విడుదల చేస్తున్నారు. ఇదే విషయాన్ని పీసీబీ అధికారులు గుర్తించారు. ఫాస్జీన్ విషవాయువులను కంపెనీ నుంచి వదులుతున్నారు. దీని ద్వారా అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. పరిశ్రమలో ఉత్పత్తులను వెంటనే నిలిపేయాలి. ల్యాబ్ కాలుష్యంపై సమగ్ర దర్యాప్తు జరిపించి.. శాశ్వతంగా మూసేయాలి. పొల్యుషన్ వల్ల నష్టపోయిన రైతులు, ప్రజలకు పరిహారం అందించాలి.
-నెట్టు నరేశ్, అంతమ్మగూడెం