సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 12 : సూర్యాపేట జిల్లాలో చోరీకి గురైన రూ.22 లక్షల విలువైన 111 మొబైల్ ఫోన్లను పోలీసులకు రికవరీ చేశారు. శనివారం జిల్లా ఎస్పీ కె.నరసింహ వాటిని బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. మొబైల్ ఫోన్ పోయినా, చోరీకి గురైన సీఈఐఆర్ అప్లికేషన్లో నమోదు చేయాలన్నారు. పది రోజుల వ్యవధిలోనే సిబ్బంది 111 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో గత రెండు సంవత్సరాల్లో 2,238 మొబైల్ ఫోన్లు పోయినట్లు సీఈఐఆర్ పోర్టల్ లో ఫిర్యాదులు వచ్చాయని వీటిల్లో 61 శాతం 1,362 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందన్నారు.
డిజిటల్ అరెస్ట్ అంటూ ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మవద్దని, డిజిటల్ అరెస్ట్ అనేది అబద్దమన్నారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్ నిత్యవసరమైందని సైబర్ మోసాలు మొబైల్ కేంద్రంగా జరుగుతున్నాయని, ఫోన్ వినియోగించడంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వినియోగదారులు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే అట్టి షాపు యజమాని నుంచి రసీదు తప్పకుండా తీసుకోవాలన్నారు. ఫోన్లు తిరిగి పొందిన బాధితులు జిల్లా పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.