యాదాద్రి భువనగిరి, మార్చి 23 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కష్టాలు తప్పడం లేదు. ఇటీవల వరకు గ్యాస్ కోసం తండ్లాడిన జనం.. ఇప్పుడు బండ్లలో చమురు కోసం లబోదిబోమంటున్నారు. బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. దాదాపు సగం బంకుల్లో స్టాక్ లేక పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బంకు నిర్వాహకులు బిల్లులు చెల్లించకపోవడంతో ఆయిల్ కంపెనీలు సరఫరా నిలిపివేసినట్లు తెలిసింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెరుచుకున్న కొన్ని చోట్ల వాహనదారులు పెద్ద ఎత్తున పోటెత్తుతుండటంతో భారీ రద్దీ నెలకొంది.
సగం బంకులు బంద్..!
యాదాద్రి భువనగిరి జిల్లాలో 160 వరకు పెట్రోల్ బంక్‌లు ఉన్నాయి. వీటికి ఇండియన్ ఆయిల్, హెచ్‌పీ, రిలయన్స్ జియో ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ సరఫరా అవుతుంది. జిల్లాకు సాధారణంగా సుమారుగా ప్రతిరోజు 1.50లక్షల లీటర్ల పెట్రోల్, 4లక్షల లీటర్ల డీజిల్ సరఫరా అవుతుంది. కానీ రెండు, మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ సరఫరా భారీగా తగ్గిపోయింది. దీంతో బంకుల్లో పెట్రో ఉత్పత్తులు నిల్వ తగ్గిపోయింది. ఇది కాస్తా సోమవారానికి పూర్తిగా ఖాళీ అయ్యింది.
ఫలితంగా యజమానులు బంకులను తాత్కాలికంగా మూసేశారు. నోస్టాక్ అంటూ బోర్డులు పెట్టారు. దాదాపు సగం బంకుల వరకు బంద్ చేసినట్లు నమస్తే తెలంగాణ పరిశీలనలో తేలింది. దీంతో జనం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పెట్రో కొరత ఏర్పడిందనే వార్త దావానంలా వ్యాపించడంతో అందరూ తెరుచుకున్న బంకు వద్ద బారులుదీరారు. అవసరం లేకున్నా రోజువారీ కంటే రెండింతలు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేశారు. బంకులు బంద్ కావడంతో నిజంగా అవసరం ఉన్న చాలా మంది తీవ్ర అవస్థలు పడ్డారు. బండ్లు మధ్యలోనే ఆగిపోవడంతో అనేక మంది బాటిళ్లలో తీసుకెళ్లారు.
కారణం ఇదే..
వాస్తవానికి పెట్రో కంపెనీల వద్ద చమురు పుష్కలంగా ఉంది. అయితే గతంలో బంకు యజమానులకు కంపెనీలు రూ.20లక్షల వరకు క్రెడిట్ ఇచ్చేవి. ఇప్పుడు మొత్తం డిపాజిట్ చేస్తేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అది కూడా సమ యం తీసుకుంటున్నట్లు సమాచారం. డీల ర్లు ఎప్పటికప్పుడు డిపాజిట్ చేయకపోవడంతో కంపెనీలు సరఫరా నిలిపివేస్తున్నాయి. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇంధనం రావడం లేదనే ప్రచారం కూడా జరుగుతున్నది. పెట్రో రేట్లు పెరుగుతాయనే డీలర్లు పెట్రోల్, డీజిల్ తెప్పించుకోవడంలేదనే వాదన కూడా వినిపిస్తున్నది. అంతిమంగా వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.