ములకలపల్లి, సెప్టెంబర్ 02 : అత్యాచారానికి గురై హత్యకు గురైన శిరీషా కుటుంబాన్నిఎంపీ వద్దిరాజు రవిచంద్ర బుధవారం పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం చౌటిగూడెంకు చెందిన ఊకే శిరీషా హైదరాబాద్ లోని ఒక ఆస్పత్రిలో నర్స్ గా పని చేస్తూ అత్యాచారానికి గురై హత్యకు గురైన విషయం తెలిసిందే. కేటీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం చౌటిగూడెంలోని శిరీషా నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కేటీఆర్ కు ఫోన్ చేసి శిరీషా తల్లి రామలక్ష్మీ, సోదరుడు శివరాంలతో మాట్లాడించారు. పుట్టెడు దుఃఖంతో ఉన్న వారిని కేటీఆర్ ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఈ దారుణానికి ఒడిగట్టిన రాక్షసుడిని కఠినంగా శిక్షించడం ద్వారా తమకు న్యాయం చేయాల్సిందిగా శిరీషా వారు కోరగా కేటీఆర్ స్పందించి ఈ దారుణ ఘటన గురించి అసెంబ్లీలో లేవనెత్తి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని అభయమిచ్చారు.ఆపదలో ఉన్న మిమ్మల్ని ఓదార్చి మనోధైర్యాన్ని ఇవ్వడానికే రవిచంద్ర, నాగేశ్వరరావులు వచ్చారని,న్యాయం జరిగే వరకు మీ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ వారికి చెప్పారు.శిరీషా తల్లి రామలక్ష్మీకి ఎంపీ రవిచంద్ర 50వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉప్పల వెంకటరమణ, కాపు సీతామహాలక్ష్మీ, సింధూ తపస్వి, ఉపాధ్యాయుల సూర్యప్రకాశరావు, మోరంపూడి అప్పారావు, పుష్పాల చందర్ రావు, మేకల వెంకటేశ్వర రావు, కొండవీటి రాజారావు, మేకల రాజేష్, గ్రామ సర్పంచ్ పద్మ పాల్గొన్నారు.