తిరువనంతపురం: అంతరాష్ట్ర సరిహద్దులో ఒక వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. డ్రైవర్ సీటు కింద రహస్యంగా దాచిన రూ.1.44 కోట్ల నగదు గుర్తించారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనంలో ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ డబ్బు గురించి వారిని ప్రశ్నిస్తున్నారు. (Rs 1.44 Crore Cash Seized) కేరళలోని వయనాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కేరళ-కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన తోల్పట్టి వద్ద తిరునెల్లి పోలీసులు, ఆ జిల్లా మాదకద్రవ్యాల నిరోధక ప్రత్యేక బృందం సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కర్ణాటక నుంచి వస్తున్న ఒక వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. డ్రైవర్ సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో దాచిన నగదు కట్టలు చూసి పోలీసులు షాక్ అయ్యారు. వాటిని లెక్కించగా రూ. 1,44,50,000గా తేలింది.
కాగా, వాహనంలో లభించిన ఆ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కోజికోడ్‌లోని వడకరకు చెందిన 20 ఏళ్ల ప్రభు రాజ్, కన్నూర్ జిల్లా పనూరుకు చెందిన 23 ఏళ్ల స్వప్నిల్, మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల రాహుల్‌గా వారిని గుర్తించారు. రూ.1.44 కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడకు తరలిస్తున్నారు అన్నది వారిని ప్రశ్నిస్తున్నారు.