Polluted Air | వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా గాలిలోని అత్యంత సూక్ష్మమైన కాలుష్య కణాలు శరీరంలోని వివిధ అవయవాలపై ప్రభావం చూపడంతో పాటు క్యాన్సర్ ముప్పును కూడా పెంచుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ జనాభాలో దాదాపు 99 శాతం మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన గాలి నాణ్యత ప్రమాణాలను మించిన కాలుష్యానికి గురవుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. 2000 నుంచి 2020 మధ్య కాలంలో ప్రపంచంలోని 952 ప్రాంతాల్లో నమోదైన క్యాన్సర్ భారాన్ని, సాధారణ వాయు కాలుష్య కారకాలకు దీర్ఘకాలికంగా గురికావడంతో ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేశారు. మొత్తం 10.9 కోట్ల క్యాన్సర్ కేసులను పరిశీలించిన ఈ పరిశోధనలో పీఎం2.5 ప్రధాన పాత్ర పోషిస్తున్న కాలుష్య కారకంగా గుర్తించారు. ఈ అధ్యయన ఫలితాలు నేచర్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
2.5 మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణం కలిగిన సూక్ష్మ కణాలను పీఎం2.5గా పిలుస్తారు. ఇవి చాలా చిన్నగా ఉండటంతో శ్వాస ద్వారా శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తాయి. అధ్యయనం ప్రకారం 2000-2020 మధ్య నమోదైన మొత్తం క్యాన్సర్ కేసుల్లో సుమారు 88.2 లక్షల కేసులకు పీఎం2.5 కాలుష్యం కారణమై ఉంటుందని అంచనా వేశారు. ప్రతి క్యూబిక్ మీటర్ గాలిలో పీఎం2.5 స్థాయి 10 మైక్రోగ్రాములు పెరిగినప్పుడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 17.9 శాతం పెరిగినట్లు అధ్యయనంలో గుర్తించారు. అదే స్థాయిలో పీఎం2.5కు గురికావడం వల్ల కిడ్నీ క్యాన్సర్ ప్రమాదం 17.9 శాతం, మూత్రాశయ క్యాన్సర్ ప్రమాదం 21.1 శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. పీఎం2.5 ప్రభావం కేవలం శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం కాదని పరిశోధకులు తెలిపారు. థైరాయిడ్, అన్నవాహిక, పెద్దపేగు, మలద్వారం, రొమ్ము వంటి ఇతర భాగాలకు సంబంధించిన క్యాన్సర్లతోనూ ఈ కాలుష్యానికి సంబంధం ఉన్నట్లు అధ్యయనం సూచించింది.
పీఎం2.5 కాలుష్యం తొలగించగలిగితే లేదా దానికి గురికావడాన్ని గణనీయంగా తగ్గించగలిగితే శ్వాసనాళం, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసుల్లో సుమారు 17.9 శాతం వరకు నివారించవచ్చని అధ్యయనం అంచనా వేసింది. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు పీఎం2.5 ఒక ప్రధాన కారణమనే విషయాన్ని ఈ ఫలితాలు మరింత బలపరుస్తున్నాయి. అదేవిధంగా, ఇతర వాయు కాలుష్య కారకాల ప్రభావాన్ని కూడా పరిశోధకులు పరిశీలించారు. ప్రతి క్యూబిక్ మీటర్‌కు 10 మైక్రోగ్రాముల చొప్పున పీఎం2.5, ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగినప్పుడు క్యాన్సర్ ప్రమాదం వరుసగా 16 శాతం, 4.23 శాతం, 11.7 శాతం పెరిగినట్లు గుర్తించారు. 2000 నుంచి 2020 మధ్య నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యానికి సంబంధించి సుమారు 66.7 లక్షల క్యాన్సర్ కేసులు నమోదైనట్లు అధ్యయనం అంచనా వేసింది. ఓజోన్ కాలుష్యానికి సంబంధించి సుమారు 26 లక్షల కేసులు ఉన్నట్లు వెల్లడించింది. ఎక్కువ రకాల క్యాన్సర్ల విషయంలో పురుషులతో పోలిస్తే మహిళలు ఈ కాలుష్య ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ప్రపంచవ్యాప్తంగా తక్కువ, మధ్యస్థ ఆదాయ దేశాల్లో వాయు కాలుష్యానికి గురికావడం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ప్రపంచ జనాభాలో దాదాపు 99 శాతం మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన గాలి నాణ్యత మార్గదర్శకాలను మించిన కాలుష్య స్థాయిలను పీలుస్తున్నారని పరిశోధకులు తెలిపారు. పీఎం2.5 కణాలు చాలా చిన్న పరిమాణంలో ఉండటం వల్ల శరీరంలోకి లోతుగా ప్రవేశించి అనేక జీవక్రియలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధకులు వివరించారు. శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం, డీఎన్ఏ దెబ్బతినడం, రోగనిరోధక వ్యవస్థ పనితీరులో మార్పులు వంటి ప్రక్రియల ద్వారా ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని తెలిపారు. వాయు కాలుష్యం శరీరంలోని దాదాపు ప్రతి అవయవ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధ్యయనం పేర్కొంది. వివిధ ఆదాయ స్థాయిలకు చెందిన దేశాలు, ప్రాంతాల నుంచి సేకరించిన క్యాన్సర్ డేటాను ఈ పరిశోధనలో ఉపయోగించడంతో ఫలితాలను ప్రపంచవ్యాప్తంగా వర్తింపజేయడానికి అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు.