నల్లగొండ ప్రతినిధి, జనవరి30 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలుపై బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించింది. అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తికావస్తున్నా హామీల అమలేది అంటూ వినూత్నంగా నిరసనకు దిగింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీలు శ్రేణులు గురువారం కదం తొక్కాయి. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూనే… హామీలపై కాంగ్రెస్ మోసాన్ని ఆలకించాలని మహాత్ముడి విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. గాంధీ విగ్రహాలు ఉన్న ప్రతి చోటా నిరసన తెలిపారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలతోపాటు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు గుర్తు చేశారు. ఏడాది పాలన పూర్తి చేసుకుని 420 రోజుల గడుస్తున్నా నేటికీ ఇచ్చిన హామీలన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తు చేసేందుకే గాంధీజీకి వినతిపత్రాలు ఇచ్చినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వినతిపత్రాల సమర్పణ కొనసాగింది. మండల కేంద్రాల్లోనూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ బూటకపు హామీలపై కదిలి నిరనస వ్యక్తం చేశాయి. దేవరకొండలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గాంధీకి ఘనంగా నివాళులు అర్పించి.. కాంగ్రెస్ మోసపూరిత హామీలపై వినతిపత్రాన్ని సమర్పించారు.
కాంగ్రెస్ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నదని, ఇప్పుడు వాటి అమలుపై పోరాటం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులతో వేధిస్తున్నదని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మోసాలపై ప్రజల తిరుగుబాటు మొదలైందని, ప్రజా పోరాటంతోనే ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. మిర్యాలగూడలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చాయి. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీకి నివాళులు అర్పిస్తూ వినతిపత్రం అందజేశారు. నల్లగొండలోని గాంధీ పార్కులో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించారు.
కాంగ్రెస్ పార్టీ 420 హామీలపై వినతిపత్రం అందజేశారు. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని నిరనసన తెలిపారు. సంస్థాన్‌నారాయణపురంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ పాల్గొని గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తుంగతుర్తి నియోజవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. ఇక్కడ గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై వినతిపత్రం అందజేశారు.
ఆత్మకూర్(ఎం)లో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, భువనగిరి మండలంతాజ్పూర్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. సూర్యాపేట, నాగార్జునసాగర్, హుజూర్నగర్, కోదాడ, భువనగిరి, ఆలేరు నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ముఖ్య నేతలంతా కలిసి గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. మండల కేంద్రాల్లోనూ నిరసన తెలిపారు. భువనగిరి పట్టణంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపి నివాళులర్పించారు. ఆలేరు పట్టణం, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్ట, రామన్నపేట, వలిగొండ, తుర్కపల్లి, గుండాల, మోటకొండూరులో మహాత్ముడి విగ్రహానికి వినతి పత్రాలు అందజేశారు.రానున్న కాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై మరిన్ని ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా పార్టీ నేతలు స్పష్టం చేశారు.