పెన్పహాడ్, జులై 03 : పెన్పహాడ్ మండల పరిధిలోని లింగాల గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ భూమి గెట్టు తగాదాల్లో ఇరు కుటుంబాలు గొడవ పడి కొట్టుకోవడంతో ఒకరికి తీవ్ర గాయలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం గ్రామానికి చెందిన రైతులు శానం రామలింగయ్య, శానం వెంకటేశ్వర్లు అన్నదమ్ములు. వీరికి పెన్పహాడ్ మండలం లింగాల గ్రామ శివారులో వ్యవసాయ భూములు ఉన్నాయి.
గురువారం శానం రామలింగయ్య ఆయన కుమారుడు భరత్, భార్య కళమ్మ, అదేవిధంగా శానం వెంకటేశ్వర్లు ఆయన కుమారులు నాగేంద్రబాబు, లక్ష్మణరావు పొలం వద్దకు వెళ్లారు. ఇరు కుటుంబ సభ్యులు భూముల గెట్టు వద్ద వాగ్వాదం తలెత్తడంతో ఘర్షణ పడ్డారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో భరత్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కళమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కస్తాల గోపికృష్ణ తెలిపారు.