యాదగిరిగుట్ట, డిసెంబర్ 11 : ‘యాదగిరిగుట్ట దేవస్థానంలో అకౌంటెంట్ సెక్షన్లో కంప్యూటర్ ఆపరేటర్ శాశ్వత ఉద్యోగం. బీటెక్ చదివితే చాలు.. నెలకు రూ.40వేల జీతం. ఇంటర్వ్యూ, పరీక్ష లేకుండా దేవాదాయ శాఖ కార్యదర్శి కార్యాలయం నుంచి నేరుగా ఇంటికే నిమాయక ఉత్తర్వులు వస్తాయి. ఒక్కో ఉద్యోగానికి రూ.1.50 లక్షలు ఖర్చవుతుంది. మొదలు రూ.75వేలు చెల్లించి, ఉద్యోగంలో చేరిన తర్వాత మిగతా డబ్బులు చెల్లించాలి.’ అని ఓ మహిళ మాట్లాడిన ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. నెలలోపే ఉద్యోగం ఇచ్చే పూచీ తనదంటూ నమ్మబలికింది. డబ్బులిస్తే దానికి తానే ష్యూరిటీ ఇస్తానని చెప్పిన సదరు మహిళ.. ఈ విషయం ఎక్కడా లీక్ చేయవద్దని తెలిపింది.అయితే.. ఈ సంభాషణ వెలుగులోకి వచ్చి సంచలనంగా మారింది.
ప్రామిసరీ నోట్ తీసుకొస్తే తానే ష్యూరిటీ ఇస్తానని నమ్మించి జిల్లాలో పలువురి వద్ద నుంచి లక్షలు దండుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. తనది భువనగిరి మండలంలోని కూనూరు గ్రామం. తన పేరు రాము అని ఓ వ్యక్తి సదరు మహిళకు ఫోన్ చేసి మీ ఫోన్ నంబర్ హన్మాపురం గ్రామానికి చెందిన వ్యక్తి ఇచ్చారని, యాదగిరిగుట్ట కొండపైన ఉద్యోగం ఇప్పించాలని కోరాడు. ఈ క్రమంలో ఆమె తన వ్యవహారం బయటపెట్టింది. తాను భువనగిరిలోనే ఉంటానని, దేవస్థానం ఈఓ కార్యాలయంతోపాటు గోదామ్ ఇన్చార్జిగా విధులు నిర్వర్తిస్తున్నానని చెప్పింది.
‘నాకు హైదరాబాద్లో ఉన్న సంబంధాలతో దేవాదాయ శాఖ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కొండపైనే ఉద్యోగం ఇప్పిస్తాం. నేడో రేపో నేను హైదరాబాద్కు వెళ్తాను. ఇద్దరికి ఉద్యోగాలిప్పించేది ఉంది. మీరు ఓకే అంటే రూ.1.50 లక్షల్లో సగం అంటే రూ.75 వేలు ఇవ్వండి’ అని తెలిపింది. దీంతో ఆ వ్యక్తి ఎక్కడికి వచ్చి డబ్బులివ్వాలని అడుగగా.. ‘మా ఇంటికే రావచ్చని, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఒకరికి సాయం చేసే విషయంలో భయపడాల్సిన అవసరం లేదు కదా’. అని చెప్పింది.
హైదరాబాద్లోని దేవాదాయ శాఖ ద్వారానే ఉద్యోగం వస్తుంది కాబట్టి ఇది ఎక్కడా లీక్ కావద్దని చెప్పింది. కొండపైన పులిహోర, లడ్డూ ప్యాకింగ్ విభాగంలో సైతం రెండు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రూ.20 వేల వరకు జీతం వస్తుందని తెలిపింది. ఫోన్ సంభాషణ ఆలయ ఈఓ భాస్కర్రావు వద్దకు చేరింది. ఆయన సదరు మహిళ మాట్లాడిన ఫోన్ నెంబర్ సేకరించారు. విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సదరు మహిళ ఫోన్ నెంబర్ ట్రూ కాలర్ ఐడీలో ‘వైజీటీ లత గారు’ అని వస్తున్నది.