రామగిరి, నవయర్ 25 : నిత్య యోగా సాధనతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ప్రముఖ యోగా గురువు మాదగోని శంకరయ్య అన్నారు. నల్లగొండలోని చర్లపల్లిలో గల డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్- బీఈడీలో విద్యార్థులకు మంగళవారం ‘యోగా అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి శిక్షకులుగా ఆయన హాజరై మాట్లాడారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి యోగా సాధన ఎంతో ముఖ్యమన్నారు. దానిని తెలియజేయాలనే ఉద్దేశంతోనే విద్యా శిక్షణ కళాశాలలో యోగా సబ్జెక్టును దేశవ్యాప్తంగా ఎన్సీఈఆర్టీ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. దీనిలో భాగంగా తొలుత విద్యార్థులకు యోగా విశిష్టతతో పాటు యోగాసనాల ప్రాముఖ్యతను వివరించారు.
అనంతరం పలు యోగాసనాలు వేసి చూపించి వాటి సాధన తీరును తెలిపి విద్యార్థులచే చేయించారు. ఈ సందర్భంగా శంకరయ్యను నిర్వాహ కులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీవీఎం విద్యా శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.గంగాధర్ రావు, బోళ్ల నారాయణరెడ్డి, ఎంఈడీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బొడ్డుపల్లి రామకృష్ణ, సీనియర్ అధ్యాపకులు ఆర్.సత్యనారాయణ, మేడిపల్లి రవి, ఎ.సరిత, శ్వేత, డీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, డీవీఎం విద్యాసంస్థల సూపరింటెండెంట్ చోలేటి శ్రీధర్ ఆచారి, కళాశాల ప్రోగ్రామర్ పి.శ్రీధర్ రెడ్డి, కళాశాల జూనియర్ అసిస్టెంట్ జె.విజయలక్ష్మి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.