త్రిపురారం, జూన్ 25 : సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని త్రిపురారం మండల కేంద్రంలోని పీహెచ్సీ వైద్యుడు మాలోతు సంజయ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆయన మాట్లాడుతూ.. జూలై నెలలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. వేడి పదార్ధాలను తీసుకోవడం, శుభ్రపరచిన గోరువెచ్చని నీటిని తాగడం మంచిదన్నారు.
మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించేలా అంతా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో నీటి గుంటలను గుర్తించి పూడ్చివేయడంతో పాటు మురుగుకాల్వల నీటిని గ్రామాల చివరికి వెళ్లే విధంగా చూసుకోవాలన్నారు. గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది పనిచేస్తున్నారని, ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అన్ని రకాల మందులు పీహెచ్సీలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.