నల్లగొండ, జూన్ 14 : తిప్పర్తి మండలంలోని కొరివేని గూడెం, తానేదార్పల్లి, నల్లగొండ మున్సిపాలిటీలోని శేషమ్మ గూడెం, ఎస్టీ కాలనీ, నల్లగొండ మండలంలోని ఖాజీరామారం గ్రామాల్లో విద్యుత్ కోతలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిప్పర్తి మండల విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ గ్రామాల్లో ఎనిమిది నెలలుగా కరెంటు కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. కొత్త లైన్ వేసి ఎనిమిది నెలలు అవుతున్నప్పటికీ ప్రారంభించకపోవటం వల్ల ఈ సమస్య నెలకొంటున్నదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి.
తిప్పర్తి మండలంలోని పజ్జూర్ సబ్స్టేషన్ ద్వారా సింగిల్ ఫీడర్తో కొరివేని గూడెం, తానేదార్ పల్లి, శేషమ్మ గూడెం, ఎస్టీ కాలనీ, ఖాజీ రామారంతోపాటు పానగల్ వ్యవసాయ బావులకు కరెంట్ సరఫరా అవుతున్నది. గృహ వినియోగ, వ్యవసాయ కనెక్షన్ల పెరుగుదల వల్ల చిన్న చిన్న సమస్యలకే కరెంట్ ట్రిప్ అవుతుండటంతో ఏడాది కింద పజ్జూర్ నుంచి కొత్త లైన్ తానేదార్పల్లి వరకు వేశారు. ఆ లైన్ వేసి ఎనిమిది నెలలైనా ప్రారంభించలేదు. దాంతో ఓవర్లోడ్ వల్ల చిన్న సమస్యలకే కరెంట్ ట్రిప్ అతున్నది. ఇటీవల కురుస్తున్న వర్షాలు, గాలి దుమారం కారణంగా క్షణక్షణం కరెంట్ ట్రిప్ అవటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కరెంట్ పోగానే వేయాలంటే లైన్మెన్లు సకాలంలో అందుబాటులో లేనందున గంటల తరబడి కూడా కరెంట్ వచ్చే పరిస్థితి లేదు.
ఇక రాత్రి పూట ట్రిప్ అయితే తెల్లారే వరకు కరెంట్ గురించి పట్టించుకునే వారే లేరు. దాంతో గ్రామాల్లో తాగు నీరు, వాడకం నీటి సమస్య తీవ్రంగా ఏర్పడుతున్నది. ఎండాకాలం నుంచి ఇంకా బయట పడకముందే కరెంట్ కటింగ్ ఉండటంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు పనిచేయక జనం సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు చిన్న సమస్యలకే లైన్మెన్లు ఎల్సీలు ఇవ్వడం వల్ల కరెంట్ సరఫరాకు మరింత అంతరాయం ఏర్పడుతున్నది. ఈ విషయంపై తిప్పర్తి విద్యుత్ ఏఈని ఫోన్లో వివరణకు సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
నాకు ఇద్దరు ఆడ పిల్లలు. వాళ్ల పెండ్లి చేసిన. నా భర్త చనిపోతే నేను ఒక్క దాన్నే ఉంటా. స్తంభం మీద లైన్ సమస్య వల్ల మా ఇంట్ల కరెంట్ వస్తలేదు. లైన్మెన్కు చెప్పి జర చూడమంటే అస్సలు వస్తలేడు. పైగా ఎవరితోనన్న చెక్ చేయించుకోమని అంటున్నాడు. కరెంట్ బంద్ చేయమంటే పైన ఎవరూ బంద్ చేయరని వేరేవాళ్లు వస్తలేరు. పది రోజుల నుంచి చీకట్లోనే పడుకుంటున్నాను.
– లక్ష్మమ్మ, ఖాజీరామారం, నల్లగొండ మండలం