– నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర
నీలగిరి, జూన్ 04 : నల్లగొండ నగరంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే వార్డు సభల్లో ఆయా డివిజన్ల ప్రజలు భాగస్వాములు కావాలని నల్లగొండ మున్షిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర కోరారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం 1, 2, 3వ డిచిజన్లలో వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు సభల ద్వారా ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు స్థానిక సమస్యలను గుర్తించి ప్రజల సూచనలు స్వీకరించి పౌర సేవలను మరింత మెరుగుపరచడం జరుగుతుందన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీలలో చెత్త వేయకూడదని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల నివారణ చర్యలకు సహకరించాలని ప్రజలకు సూచించారు. అలాగే తాగునీటిని మరిగించి తాగడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. వార్డు సభలలో ప్రజల నుండి తాగునీటి సరఫరా, పారిశుధ్యం, డ్రైనేజీలు, వీధి దీపాలు, రహదారులు, వర్షపు నీటి సంరక్షణ, మొక్కల పెంపకం తదితర అంశాలపై వినతులు, సూచనలు స్వీకరించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
నగర ప్రజలందరూ తమ డివిజన్లలో నిర్వహించే వార్డు సభలకు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి వద్ద చెత్తను తడి చెత, పొడి చెత్త, శానిటరీ చెత్త అలాగే ప్రత్యేక సంరక్షణ చెత్తగా నాలుగు రకాలుగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. చెత్తను మూలం వద్దనే వేరు చేయడం ద్వారా పరిశుభ్రమైన నగర నిర్మాణంతో పాటు వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ సాధ్యమవుతుందని వివరించారు. ఈ సందర్భంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ రూల్స్ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు పేర్ల మహేశ్వరి అశోక్, పెరిక యాదయ్య, అలకుంట్ల నాగరాజు, రత్నగిరి తారకమ్మశ్రీనివాస్, అక్కెనపల్లి స్వాతి బలరాం, పున్న జ్ఞానేశ్వరి గణేష్, గుండోబోయిన పుష్పలత, శానిటరీ ఇన్స్పెక్టర్ నంద్యాల ప్రదీప్ రెడ్డి వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

‘వార్డు సభల్లో ప్రజలు భాగస్వాములు కావాలి’