కోదాడ, ఆగస్టు 28 : అలివికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విరక్తి పెరిగిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు. కోదాడలోని తన నివాసం బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీలు అమలు చేయడం లేదని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావును ప్రజలు నిలదీశారని గుర్తుచేశారు.
ఆగస్టు 15లోగా ప్రతి రైతుకూ 2 లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మబలికి సీఎం రేవంత్‌రెడ్డి మాట తప్పారని మండిపడ్డారు. ఏ గ్రామంలోనూ 35 నుంచి 40 శాతానికి మించి రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నామా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ కాని విషయంలో వ్యవసాయ అధికారులు, కలెక్టర్ల వద్ద కూడా స్పష్టమైన సమాచారం లేదన్నారు.
హామీలు అమలు చేయలేక బీఆర్ఎస్ అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని, వాటిని మానుకొని ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆయకట్టుకు నీరందక రైతులు అవస్థ పడుతుంటే.. ఇక్కడి నుంచి పోలీస్ పహారాతో మంత్రి తుమ్మల సాగునీటిని తరలించకపోతున్నా జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ పెదవి విప్పలేదని మండిపడ్డారు. హామీలు అమలు చేయలేకే కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నదని ఆరోపించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య లోపంతో ప్రజలు విషజ్వరాలతో బారిన పడుతున్నారని, ప్రభుత్వ దవాఖానల్లో మందులు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. కవితమ్మ బెయిల్‌పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ నాయకులు అక్కసుతో చేస్తున్న అపరిపక్వ వ్యాఖ్యలు కోర్టు తీర్పును అపహాస్యం చేసేలా ఉన్నాయన్నారు. కవిత కడిగిన ముత్యంలా బెయిల్‌పై బయటకు వచ్చారని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ చిలుకూరు, నడిగూడెం మండలాధ్యక్షులు జానకి రామాచారి, భూపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు పైడిమర్రి సత్యభామ, పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్, అఫ్జల్, వెంపటి నాగమణి, కట్టెకోల వెంకట్, రాంబాబు, మాదాల ఉపేందర్, ఎస్కే అబ్బు, బోసు పాల్గొన్నారు.