అర్వపల్లి, ఆగస్టు 21 : సెర్ప్ తెలంగాణ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చేయూత, సామాజిక భద్రతా పింఛన్ల కింద మొదటి దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న అర్హులైన వారు కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు అర్వపల్లి ఎంపీడీఓ ఝాన్సీ శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవసరమైన ధ్రువపత్రాలతో ఈ నెల 31లోగా సమర్పించాలన్నారు.
ఇప్పటికే గ్రామ పంచాయతీ/వార్డు కార్యాలయంలో సంబంధిత పత్రాలతో దరఖాస్తులు సమర్పించిన వారు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ వహించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారికి దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. గ్రామ పంచాయతీలకు అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి, అవసరమైన వివరాలను చేయూత పోర్టల్లో ఎలాంటి జాప్యం , తప్పులు లేకుండా నమోదు చేసేలా సర్పంచులు సహకరించాలని కోరారు.