నీలగిరి, నవంబర్ 23 : జిల్లా జనరల్ దవాఖానలో పని చేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు, పీఎఫ్ వెంటనే చెల్లించాలని నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు, పీఎఫ్ వెంటనే చెల్లించాలని కోరుతూ నాలుగు రోజులుగా సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో పని చేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికుల ధర్నాకు ఆదివారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతినెలా జీతాలు వచ్చేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు నెలలు దాటినా జీతాలు రావడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి దవాఖానలను బలోపేతం చేస్తే రేవంత్‌రెడ్డి సర్కారు వాటిని నిర్వీర్యం చేస్తోందన్నారు. దవాఖానలను పేదోళ్ల దేవాలయాలుగా మార్చితే కాంగ్రెస్ మాత్రం వాటిని పేద ఆసుపత్రులుగా మార్చిందన్నారు. వెంటనే పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వాలని, లేకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగు రోజులుగా ఆసుపత్రి కార్మికులు విధులు బహిషరించి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు.
నూతనంగా తీసుకున్న 70 మందికి నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం, పాతవారికి పీఎఫ్, ఈఎస్ఐ కోసం వేతనాల నుంచి కటింగ్ చేసినా వారి ఖాతాల్లో జమ చేయకుండా టెక్నికల్ సమస్య పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఏవన్ ఏజెన్సీ వచ్చినప్పటి నుంచి కార్మికుల సమస్యలు పెరిగాయని ఆరోపించారు. వేతనాలు ఇవ్వకుండా, పీఎఫ్ కట్టకుండా కాలయాపన చేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్నిసార్లు నిరసన కార్యక్రమాలు, వినతిపత్రాలు ఇచ్చినా స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిరవధిక ఆందోళన చేపట్టాల్సి వచ్చిందన్నారు. కాంట్రాక్టర్ కాలపరిమితి ముగిసిందని, పీఎఫ్ కట్టకుండా పోతే అధికారులే బాధ్యత వహించాలన్నారు. నిరుపేద కుటుంబాల చెందిన కార్మికులు నాలుగు నెలలుగా జీతాలు లేకుండా ఏ విధంగా బతకాలని ప్రశ్నించారు. తక్షణమే కాంట్రాక్టర్, అధికారులు స్పందించి పెండింగ్ జీతాలు చెల్లించాలని, పీఎఫ్ క్లియర్ చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ, నాయకులు ఎండీ సలీం, సత్తయ్య, దవాఖాన కాంట్రాక్ట్ వరర్స్ యూనియన్ నాయకులు యాదగిరి వెంకన్న, సైదులు, నాగరాజు, భాసర్, భాగ్యమ్మ, నిర్మల, లలిత, నాగమణి, కవిత, ఉషమ్మ, యాదమ్మ, స్వాతి, అజీమ్, ధనమ్మ, పార్వతమ్మ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.