నల్లగొండ, జూలై 14 : గీత వృత్తిలో తాటి చెట్ల మీద నుండి పడి చనిపోయిన, ప్రమాదాలకు గురైన కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ ఎక్స్గ్రేషియా వెంటనే చెల్లించాలని కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అద్యక్షుడు కొండ వెంకన్న అన్నారు. పెండింగ్ ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో 710 మంది కార్మిక కుటుంబాలకు రూ.12.96 లక్షల పెండింగ్ ఎక్స్గ్రేషియా చెల్లించాల్సి ఉందన్నారు. నల్లగొండలో 27 మంది చనిపోగా, 67 మంది శాశ్వత వైకల్యం పొందారని, నలుగురు పాక్షిక వికలాంగులుగా మారినట్లు తెలిపారు.
బడ్జెట్ లేదనే సాకుతో ఏండ్ల తరబడి ఎక్స్గ్రేషియా పెండింగ్లో ఉంచితే కుటుంబ పెద్ద లేని ఆయా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నట్లు తెలిపారు. అదే విధంగా వృత్తిలో ఉన్నవారందరికి కాటమయ్య రక్ష కిట్లు ఇవ్వాలన్నారు. అలాగే 50 ఏండ్లు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని కోరారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు గుండా అచ్చాలు, రాచకొండ వెంకట్ గౌడ్, కొప్పుల అంజయ్య, ఉప్పల గోపాల్, కంట్ల మహేశ్వర్ గౌడ్, యాదగిరి, సైదులు పాల్గొన్నారు.