– టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం
రామగిరి, జూలై 11 : రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం డిమాండ్ చేశారు. శనివారం టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ సభ్యత్వం నమోదు కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన పెరుమాళ్ల వెంకటేశం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నదన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న డీఏ లను ప్రకటించాలని, పీఆర్సీ రిపోర్టులు తెప్పించుకుని 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని, హెల్త్ కార్డులను వెంటనే అందజేయాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా సీపీఎస్ రద్దుకు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరిగినందున విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాల సంఖ్య పెంచాలేగానీ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామనడం సరైంది కాదన్నారు. ఇలాంటి చర్యల వల్ల మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ లక్ష్మీనారాయణ, నరేష్, ఉపాధ్యక్షులు యాస వెంకట్ రెడ్డి, దాసరి సంధ్యారాణి, సీనియర్ నాయకులు పాలబిందల రాజశేఖర్, జి.సురేందర్, ఎం.నాగబాబు, యాదాద్రి పాల్గొన్నారు.