సూర్యాపేట టౌన్, డిసెంబర్ 22 : పెన్షనర్స్కు రావాల్సిన పెండింగ్ బిల్లులు రాష్ట ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పూర్వ అద్యక్షుడు తికుళ్ల సాయిరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాద్యాయులు ప్రభుత్వం వద్ద దాచుకున్న సొమ్మును 2024 మార్చి నుండి పెన్షనర్స్కు ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉపాధ్యాయ పెన్షనర్స్ కు ఈ దీనస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముప్పై, నలబై సంవత్సరాల పాటు ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేసి రిటైర్ అయిన ఉపాధ్యాయ, ఉద్యోగులకు గత ఇరవై ఒక్క నెలలుగా వారికి రావాల్సిన బెనిఫిట్స్ ను నేటికీ ఇవ్వకుండా కాలయాపన చేయడం మరీ అన్యాయమన్నారు.
ప్రతి నెలా వచ్చే పెన్షన్ వారు తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించడానికే సరిపోవడం లేదన్నారు. నెల నెలా కుటుంబ పోషణకు కొత్తగా అప్పు చేయాల్సిన దీనస్థితిలో నేడు అనేక మంది పెన్షనర్స్ ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మానసిక వేదనతో జబ్బున పడి ఇప్పటికే సుమారు 34 మంది పెన్షనర్స్ అసువులు బాశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ముఖ్యంగా పెన్షనర్స్ కు చెందాల్సిన బకాయిలు వెంటనే చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.