– జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సురవి యాదయ్య గౌడ్
కోదాడ, మే 21 : గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన మాజీ సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం జూన్ 1న చేపట్టబోయే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలని పేర్కొంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో సర్పంచులు అప్పులు తెచ్చి మరీ గ్రామాల్లో ఎన్నో ప్రగతి పనులు చేపట్టారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎస్ఎఫ్సీ,ఎస్డీఎఫ్, సీడీఎఫ్, మన ఊరు మన బడి నిధులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మాజీ సర్పంచులు కొందరు ఆత్మహత్యలు చేసుకోగా మరికొందరు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి బిల్లులు చెల్లించకపోతే జూన్ 1న హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ముట్టడి కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ సర్పంచులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కేశబోయిన మల్లయ్య యాదవ్, కోదాడ మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు దొంగల లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ పొట్ట శ్రీ విజయ కిరణ్ పాల్గొన్నారు..