ఆత్మకూర్ ఎస్, నవంబర్ 22 : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ సిబ్బందికి సూచించారు. శనివారం ఆత్మకూర్.ఎస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు గూర్చి ఆరా తీసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేయాల్సిందిగా సూచించారు. అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ క్షేత్రస్థాయిలో మండల ప్రజలకు చేరువ చేయాలన్నారు. ఆత్మకూర్ సబ్ సెంటర్ లోని పుప్పాలగూడ గ్రామంలో జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అసంక్రమణ వ్యాధులైన షుగర్, రక్తపోటు, క్యాన్సర్ మొదలైన వ్యాధుల నిర్ధారణ కోసం 30 సంవత్సరాల వయసు పైబడిన ప్రజలందరూ స్క్రీనింగ్ చేయించుకోవాలన్నారు. వారందరికి ఉచితంగా మందులు నెలకు సరిపడా ఆశా కార్యకర్తలచే పంపిణీ చేయబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ రమ్య, సీహెచ్ఓ, హెల్త్ సూపర్వైజర్ యాదగిరి, సైదులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.