శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే సిట్టింగ్‌లకు సీట్లు ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ మరో చారిత్రాత్మక సందర్భానికి సిద్ధమవుతున్నది. బీఆర్ఎస్ హాట్రిక్ కొడితే వచ్చే ఐదేండ్లల్లో ప్రజల కోసం ఏమేమి చేయబోతుందో ప్రజల ముందుకు ఉంచేందుకు ఆదివారం మ్యానిఫెస్టోను ప్రకటించనున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా అభ్యర్థులందరికీ బీఫారాలు అందించనున్నారు.
– నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్15(నమస్తే తెలంగాణ) : తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం స్వయంగా అభ్యర్థులందరికీ బీఫారాలు అందజేయనున్నారు. అనంతరం పార్టీ మ్యానిఫెస్టోను ప్రకటించనున్నారు. 2014, 2018 ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలతో పాటు చెప్పని ఎన్నో కార్యక్రమాలను ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో ఆసరా పెన్షన్లను రూ.వెయ్యికి పెంచి అమలు చేయగా 2018కి వచ్చే సరికి దాన్ని రూ.2,016గా ప్రకటించి అమలు చేస్తున్నారు. వికలాంగుల పెన్షన్లకు సంబంధించి 2014 తర్వాత రూ.1,500గా, 2018 మ్యానిఫెస్టో ప్రకారం తర్వాత రూ.3016 అమలు చేస్తూ వచ్చారు. ఇటీవల మరో వెయ్యి పెంచి రూ.4,016 అందిస్తున్నారు. ఒంటరి మహిళలకు రూ.2,016 పెన్షన్ అమలు చేస్తున్నారు. వీటిన్నింటికీ తోడు ఆసరా పెన్షన్ల అర్హత వయస్సును 57 ఏండ్లకు తగ్గించారు. దాంతో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు కేసీఆర్‌పై ప్రత్యేక అభిమానం ప్రదర్శిస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో మరోసారి ఆసరా పెన్షన్ల పెంపుపైనా అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
రైతు బంధు, రుణమాఫీపై..
2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని రైతు బంధును వ్యవసాయాన్ని పండుగలా మార్చాలన్న లక్ష్యంతో 2018 జూన్ వానకాలం సీజన్ నుంచి అమలు చేస్తూ వచ్చారు. తొలి ఏడాది ఎకరాకు ఒక్కో సీజన్‌కు రూ.4 వేల వేల చొప్పున ఇచ్చారు. 2018 మ్యానిఫెస్టోలో దాన్ని ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏటా రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించి అమలు చేస్తున్నారు. కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అమలు చేస్తూ వస్తున్నారు. దాంతో వ్యవసాయం ఉమ్మడి జిల్లాలో 13 లక్షల ఎకరాల సాగు నుంచి 22 లక్షల ఎకరాలకు విస్తరించడం విశేషం. దీనికి తోడు రైతు బీమాతో ఏ కారణంతో రైతు చనిపోయినా రూ.5 లక్షలు అందజేస్తున్నారు. ఇవన్నీ రైతాంగంలో కేసీఆర్ పట్ల ప్రత్యేక ఆదరణకు, విశ్వాసానికి నాంది పలికాయి. ప్రస్తుత మ్యానిఫెస్టోలోనూ వ్యవసాయానికి పెద్దపీట వేస్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 2014, 2018లో రూ.లక్ష వరకు రుణమాఫీని ప్రకటించి అమలు చేశారు.
కరోనాతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా రూ.99,999 వరకు రుణమాఫీని వర్తింజేశారు. వాటితో పాటు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కూడా చేపట్టారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని గృహలక్ష్మి ద్వారా ఉమ్మడి జిల్లాలో తొలి దఫాలో 36 వేల మందికి సొంత ఇంటి జాగా ఉంటే రూ.3 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి అమలు చేస్తున్నారు. ఇవే కాకుండా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు దారి తీసింది. వాటిల్లో ప్రతి ఏటా ఇప్పటికే 300 వైద్య విద్య సీట్లు ఉమ్మడి జిల్లాలో అందుబాటులోకి రాగా వచ్చే ఏడాదికి అవి 400కు పెరుగనున్నాయి. ఎంతో మంది నిరుపేద విద్యార్థులు వాటిల్లో కేవలం ఏడాదికి రూ.12 వేలతో వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఏర్పడింది. వీటికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కూడా 2014 లో రూ.51వేలు ఇవ్వగా 2018 మ్యానిఫెస్టో ప్రకారం రూ.1,00116 అందజేస్తున్నారు. ఇలా అనేక పథకాలను ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదలకు అనుగుణంగా సంక్షేమాన్ని పెంచు తూ వస్తున్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా..
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా గత తొమ్మిదిన్నర ఏండ్లల్లో విశేష కృషి చేస్తూ వచ్చారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతూ కేసీఆర్ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రి క్ విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే రానున్న ఐదేండ్ల కాలానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను దృష్టిలో ఉంచుకుని, సాధ్యాసాధ్యాలు సమగ్రంగా పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రజామోద మ్యానిఫెస్టోను సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. నేడు మధ్యాహ్నం పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందించిన అనంతరం స్వయంగా కేసీఆర్ మ్యానిఫెస్టోను వెల్లడించనున్నట్లు పార్టీ వర్గా లు తెలిపాయి. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, వృద్ధులు, దివ్యాంగులు, వింతతువులు.. సబ్బండ వర్గాలు హర్షించేలా మ్యానిఫెస్టో ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. దాంతో నేడు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించనున్న బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తున్నది. సామాన్య ప్రజలతో పాటు కాంగ్రెస్, బీజేపీ నేతలంతా మ్యానిఫెస్టో అంశాలపై ఆతృతతో ఉన్నారనడంలో సందేహం లేదు.