కోదాడ, ఆగస్టు 09 : బీసీలను మోసం చేసే పార్టీలకు పుట్టగతులుండవని తేల్చి చెప్పే సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అన్నారు. బీసీలు ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాలను దక్కించుకునేందుకు చేసే బీసీ సామాజిక ఉద్యమానికి అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటించి తమ చైతన్యాన్ని చాటుకోవాలన్నారు. శనివారం కోదాడలోని పెన్షనర్స్ కార్యాలయంలో ‘‘ఆలోచనాపరుల వేదిక’’ ఆధ్వర్యంలో పి.శివశంకర్ 96వ జన్మదినోత్సవం సందర్భంగా ‘‘బీసీల కోసం శివశంకర్’’ అన్న సెమినార్ లో జూలూరు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మేలు చేస్తే జై కొడతాం, మోసం చేస్తే తిప్పి కొడతామనే దశకు బీసీ ఉద్యమం పదునెక్కిందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను సంపూర్ణంగా అమలు జరిపేదాకా రాజకీయాలకు అతీతంగా బీసీలంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు.
బీ.పీ. మండల్ కమిషన్ ను వేసింది జనతా పార్టీ అయితే దాన్ని అమలు చేసింది జనతాదళ్ ప్రధాని వి.పి.సింగ్ అని తెలిపారు. నేరం చేసినవాళ్లే న్యాయం చేస్తున్నట్లు నటించే పార్టీల అసలు రంగును తెలుసుకుని బీసీ ఉద్యమం అడుగులు వేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమానికి పాలేటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. రాయపూడి వెంకటేశ్వరరావు, రామిశెట్టి రామకృష్ణ, పందిరి నాగిరెడ్డి, వేముల వెంకటేశ్వర్లు, ఈదుల కృష్ణయ్య, పాలేటి రామారావు, ఆవుల రామారావు, పుప్పాల కృష్ణమూర్తి, బడుగుల సైదులు, ఉయ్యాల నరసయ్య, డి.ఎన్.స్వామి, డాక్టర్ బ్రహ్మం, బొల్లు రాంబాబు, హరి కిషన్, కస్తూరి రాములు, ముసి శ్రీనివాస్, బత్తుల ఉపేందర్ పాల్గొన్నారు.