నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్15(నమస్తే తెలంగాణ) : లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుపై గురువారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. ఇందులో చర్చ కోసం కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల్లు విడుదల చేసింది. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏ నలుగురు గుమికూడినా దీనిపైనే చర్చలు జరుగుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న స్థానాలకు అదనంగా 50 శాతం లోక్సభ, 50 శాతం అసెంబ్లీ స్థానాల పెంపునకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న రెండు ఎంపీ స్థానాలతో పాటు మరో స్థానం కొత్తగా ఏర్పాటు కానున్నట్లు తెలిసింది.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్న 12 స్థానాలకు అదనంగా మరో 6 స్థానాలు పెరగనున్నాయి. దీంతో మొత్తం 18 అసెంబ్లీ స్థానాలు కాన్నాయి. అయితే ఇందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కానున్న నేపథ్యంలో పెరగనున్న ఆరు స్థానాలు మహిళలకే దక్కనున్నాయి. అయితే వీటన్నింటిపై గురువారం నుంచి మూడు రోజుల పాటు జరిగే పార్లమెంటు సమావేశాల్లో పూర్తి స్పష్టత రానుంది.
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 12 అసెంబ్లీ స్థానాలకు అదనంగా 6 స్థానాలు కొత్తగా ఏర్పడనున్నట్లు అంచనా.1952 తొలి ఎన్నికల్లో 13 సీట్లు ఉండగా 1957 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1962, 1967, 1978 ఎన్నికల సమయంలో మండలాలను అటూఇటూ మారుస్తూ సీట్ల సర్దుబాటు చేసినా సంఖ్య మాత్రం యధాతథంగా కొనసాగుతూ వచ్చింది. ఇక చివరగా 2009లో సైతం నియోజకవర్గాల పునర్విభజన జరిగినా మండలాలు అటూఇటూ మారగా సరిహద్దులు పూర్తిగా మారాయి. అయినా సంఖ్య మాత్రం 12ను మించలేదు. అప్పటివరకు ఉన్న రామన్నపేట రద్దు కాగా కొత్తగా హుజూర్నగర్ ఏర్పాటైంది. చలకుర్తి పేరు మారుస్తూ నాగార్జునసాగర్ నియోజకవర్గం ఏర్పాడింది. ఇదే సమయంలో నల్లగొండ లోక్సభ స్థానం అలాగే కొనసాగగా మిర్యాలగూడ లోక్సభ స్థానంలో భువనగిరి కొత్తగా అవతరించింది. అయితే ఈ సారి కొత్తగా మరో స్థానం అదనంగా రానుండడంతో నల్లగొండ, భువనగిరికి తోడుగా సూర్యాపేట..లేకుంటే మిర్యాలగూడ కేంద్రంగా నియోజకవర్గం అవతరించవచ్చని భావిస్తున్నారు. అయితే ఒక్కో నియోజకవర్గం 1.92లక్షల సగటు జనాభాతో ఏర్పాటు కానుండడంతో అవి ఎలా ఉంటాయన్న ఉత్కంఠత అందరిలో నెలకొంది.
కొత్తగా ఏర్పాటయ్యే అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవీ అన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనికి ప్రాతిపదిక ఏమిటన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత రాకపోయినా ఊహాగానాల్లో మునిగితేలుతున్నారు. జనాభా లెక్కల ప్రకారం పరిశీలిస్తే నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట లాంటి పట్టణాలే ఒక నియోజకవర్గం కావ చ్చు. ఇంకా అవసరమైతే వాటి రూరల్ మండలం జత కలిపినా సరిపోతుంది. దీంతో వీటికి అదనంగా రూరల్ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే అసెం బ్లీ నియోజకవర్గాల పునర్విభజనను ఈ సారి అసెంబ్లీ నియోజకవర్గాల క్రమసంఖ్య ఆధారంగా భద్రాచలం నుంచి మొదలు పెట్టి అదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్తో ముగించనున్నారని తెలుస్తోంది. కిందటి సారి సిర్పూర్ నుంచి భద్రాచలంతో ముగించారు. ఈ సారి ఇటు నుంచి అటువైపు చేపట్టనున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల క్రమసంఖ ప్రకారం దేవరకొండ(87) నుంచి మొదలై నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ, మునుగోడు, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు(97) వైపునకు నియోజకవర్గాల పునర్విభజన చేయవచ్చని ఓ అంచనా. వీటిని సగటు జనాభా లెక్కల ప్రకారం విభజిస్తూ పోతే కొత్త నియోజకవర్గాలపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఊహాగానాల ప్రకారం కొండ మల్లేపల్లి, మిర్యాలగూడ రూర ల్, సూర్యాపేట రూరల్, మునగాల లేదా నాగారం, చౌటుప్పల్, రామన్నపేట లేదా మోత్కూరు లాంటివి కొత్తగా నియోజకవర్గాలుగా ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు చర్చ సాగుతోంది. అయితే వీటన్నింటిపై గురువారం నుంచి జరుగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మరింత స్పష్టత రానుంది. అప్పటివరకు రాజకీయంగా ఏ నలుగురు కూడినా వీటిపైనే చర్చోపచర్చలు జరుగుతుండటం విశేషం.
2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లా జనాభా 34,88,809. ఇందులో పురుషుల సంఖ్య 17,59,772 కాగా మహిళల జనాభా సంఖ్య 17,29,037గా నమోదైంది. ఇదే సమయంలో రాష్ట్ర జనాభా 3,44,33,179గా నమోదైంది. కేంద్రం ప్రతిపాదించిన ప్రకారం 50 శాతం సీట్ల పెంపుతో రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాల నుంచి 26కు పెరగనుండగా, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి చేరవచ్చు. పునర్విభజనలో రాష్ట్ర జనాభా ప్రతిపాదికన తీసుకుంటే ఒక్కో ఎంపీ స్థానానికి సగటున 13.24లక్షల జనాభా పరిగణలోకి తీసుకోనున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ స్థానాల విషయంలో 1.92లక్షల జనాభా సగటున రానుంది. దీనికి 10శాతం అటుఇటుగా పరిగణలోకి తీసుకోనున్నారు. ఇలా పరిశీలించినప్పుడు ఉమ్మడి జిల్లా జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ప్రస్తుతం ఉన్న నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాలతో పాటు మరో స్థానం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థానం జిల్లా పరిధిలోకి రాకపోయినా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ కొత్త లోక్సభ స్థానం ఏర్పాటు కావొచ్చని అంచనా. సూర్యాపేట లేదా మిర్యాలగూడ కేంద్రంగా ఇది కావొచ్చని కూడా పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియజకవర్గాలు ఉండగా పునర్విభజనతో అవి అలాగే ఉంటాయా? లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సింది. ఆరు అసెంబ్లీ స్థానాలతోనే ఒక్కో స్థానం ఏర్పాటైతే జిల్లా పరిధిలోనే మూడు లోక్సభ స్థానాలు రావచ్చని ఒక అంచనా.