కట్టంగూర్, ఆగస్టు 13 : కట్టంగూర్ మండలంలోని పందనపల్లికి వెళ్లే రహదారి ఆధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈదులూరు గ్రామ శివారులోని మూల మలుసు వద్ద గుంతల్లో నీరు నిలిచి చెరువులా తయారైంది. గత కొంత కాలంగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో పందనపల్లికి వెళ్లే రహదారి పైనే వర్షపు నీరు చేరుతుంది. దీంతో ఈ రహదారి గుండా పందనపల్లి, ఆకారం, కురుమర్తి గ్రామాలకు వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే మూలమలుపు, అక్కడే వర్షపునీరు నిలువడంతో గుంతల లోతు తెలియక వాహనదారులు, రైతులు ప్రమాదాల బారిన పడుతున్నారు. విద్యార్థులైతే తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. రహదారికి ఇరు వైపులా లోతట్టుగా ఉండడంతో వరద నీరుతో పాటు ఈదులూరు డ్రైనేజీ నీరు చేరడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
వెళ్లాలంటేనే భయమేస్తుంది : ముప్పిడి యాదయ్య, మాజీ సర్పంచ్, పందనపల్లి
రహదారి మరమ్మతులకు గురై చాలా కాలమైంది. ఈదులూరు గ్రామ శివారులో రహదారులపై వర్షపు నీరు నిలిచి అధ్వానంగా మారింది. విద్యార్థులు, రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేసి ప్రయాణం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలి.