సూర్యాపేట, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : పల్లెల్లో పారిశుధ్యం లోపించి అస్తవ్యస్తంగా మారాయి. వీధుల్లో చిన్న గుంత ఏర్పడినా పూడ్చేవారే కరువయ్యారు. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతున్నది. ఈగలు, దోమల బెడద పెరిగి వ్యాధులు వి జృంభిస్తున్నాయి. ఎనిమిది నెలల్లోనే గ్రామాలు అధ్వాన్నంగా అవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి పేరిట ప్రతినెలా జిల్లాకు రూ.12 కోట్ల నుంచి రూ.16 కోట్లు ఇచ్చి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. గ్రామాలకు కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆపలేదు. దాంతో రా ష్ట్రంలోని పల్లెలు కొత్త రూపు సంతరించుకున్నాయి.
కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెలు దారుణంగా మారాయి. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటినా ఇటు రాష్ట్రం నుంచి అటు కేంద్రం నుంచి పంచాయతీల కు నిధులు రావడం లేదు. ఇటీవల కాంగ్రెస్ సర్కారు ఎంతో ఆర్భాటంగా స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం నిర్వహించినప్పటికీ నయాపైసా ఇవ్వకపోవడంతో తూతూ మంత్రంగా జరిగిపోయింది. ప్రస్తుతం ఏ గ్రామానికి వెళ్లినా మురికి గుంతలు, చెత్తా చెదారంతో నిండిన వీధులు, పెరుగుతున్న పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి.
చిల్లి గవ్వ లేదు
పల్లెలే ప్రగతికి సోపానాలని నమ్మిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో వ్యవసాయం మొదలు అనుబంధ వృత్తులకు ఊతం ఇచ్చేలా వేల కోట్ల రూపాయలు వెచ్చించారు. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఒక్క సూర్యాపేట జిల్లాకే ప్రతి నెలా రూ.12 కోట్ల నుంచి రూ.16 కోట్లు వచ్చేవి. దాంతో అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ, తదితర పనులకు వెచ్చించేవారు.
కొనుగోలు చేసిన పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేవారు. సెగ్రిగేషన్ షెడ్లలో తడిచెత్తతో ఎరువు తయారీ చేసేవారు. కానీ ..నేడు ఇలాంటివి ఎక్కడా కనిపించడం లేదు. సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరిలో పూర్తి కాగా అప్పటి నుంచి కేంద్రం నుంచి నయాపైసా రాలేదు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు ఇవ్వాలనే సోయి కూడా కనిపించడం లేదు. ఫిబ్రవరికి ముందు ఒక నెలకు సంబంధించిన కేంద్రం నిధులు పెండింగ్ ఉండగా అవి త్వరలో వస్తాయని అధికారులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కార్మికుల వేతనాల కోసం కొద్దిపాటి నిధులను ఈ నెలలో ఇచ్చినట్లు సమాచారం. అంతే తప్ప గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం నిధులు మాత్రం ఇవ్వడం లేదు.
పంచాయతీ కార్యదర్శులపై భారం
సర్పంచుల పదవీ కాలం పూర్తయిన తర్వాత పల్లెల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై పడింది. గ్రామాల్లో తరుచూ తాగునీటి బోర్లు కాలిపోవడం, పైపులైన్ల మరమ్మతులు, గేట్వాల్ మార్చడం, పారిశుధ్య పనులు, వాటర్ ప్లాంట్ల మరమ్మతులు ఇలా అనేక పనులు చేయాల్సి వస్తున్నది. ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించి చేతులు దులుపుకుంది తప్ప పంచాయతీలకు నిధులు మాత్రం ఇవ్వడం లేదు.
దీంతో సమస్యలపై ప్రజల నుంచి ఒత్తిడి పెరుగడం, కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్తుండడంతో చేసేదేమీ లేక పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి పనులు చేయాల్సి వస్తున్నది. ఇలా జిల్లాలోని ఆయా పంచాయతీల్లో సెక్రటరీలు చేసిన అప్పులు ఒక్కొక్కరివి రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల బదిలీలకు జీఓ తీసుకురావడంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పంచాయతీ సెక్రటరీలు కూడా తమ అర్హతను బట్టి ఎక్కడి వెళ్లాలో వెతుక్కునే పనిలో పడ్డారు.
మరోపక్క బదిలీ అయితే తాము ఖర్చులు చేసిన బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని పలువురు సెక్రటరీలు మదనపడుతున్నారు. ఈ విషయమై సూర్యాపేట జిల్లా పంచాయతీ అధికారి సురేశ్కుమార్ను వివరణ కోరగా సెక్రటరీలు డబ్బులు వెచ్చించి పనులు చేసింది వాస్తవమేనని, చేసిన పనులకు సంబంధించి బిల్లులు చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుందని తెలిపారు.