రామగిరి, సెప్టెంబర్ 8 : అర్ధ శతాబ్ద సాహితీ కృషీవలుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్య అని, నేటి సమాజానికి ఆయన స్ఫూర్తిదాయకుడు అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్ కీర్తించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా కూరెళ్లకు ఆదివారం నల్లగొండలోని విశ్వకర్మ భవనంలో వివిధ సాహిత్య, సామాజిక, సాంస్కృతిక సేవా సంస్థల ఆధ్వర్యంలో పౌర సన్మానోత్సవం, అభినందన సభ నిర్వహించారు.
అంతకు ముందు కూరెళ్లను ఎన్జీ కళాశాల నుంచి సభా వేదిక హైదరాబాద్ రోడ్డులోని విశ్వకర్మ భవనం వరకు గుర్రం బండిపై సన్నాయి, మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కూనూరు లక్ష్మణ్ మాట్లాడుతూ కూరెళ్ల తన గురువని, శిష్యుడులాగానే వచ్చానన్నారు. 1954లో గ్రంథాలయం గురించి ఆలోచించి శంభులింగేశ్వర స్వామి అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేశారని, తెలంగాణ పల్లె నుంచి దేశ రాజధానికి తన ప్రతిభ చాటారని కొనియాడారు
. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ పూర్వ కాలంలో గ్రంథాలయాలు స్థాపించడం రాజులు, ధన వంతులకు సాధ్యమయ్యేదని, కానీ ఇవ్వాళ ఒక సాధారణ వ్యక్తి ఇంత పెద్ద గ్రంథాలయాన్ని స్థాపించడం మన ప్రాంతానికే గర్వకారణమన్నారు. తన సంకల్ప బలంతో సాధించగలిగారని తెలిపారు. సభాధ్యక్షుడు, తెలుగు అధ్యాపకుడు, కవి తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ కూరెళ్ల జీవిత కాలంలో అనేక కష్టనష్టాలు ఎదురైనప్పటికీ అన్నింటినీ సమానంగా స్వీకరించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఉమ్మడి జిల్లాకే గర్వకారణమన్నారు. ఓయూ తెలుగు శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.రఘు మాట్లాడుతూ తన సాహిత్య స్ఫూర్తిని అందరిలో నింపుతూ తానే ఒక విశ్వవిద్యాలయంగా అయ్యారని తెలిపారు. దాశరథి అవార్డు గ్రహీత వేణు సంకోజు మాట్లాడుతూ కూరెళ్ల అందరికీ ఆదర్శనీయులన్నారు. ఈ కార్యక్రమంలో సభ సమన్వయ కర్త పెందోట సోము, ప్రధాన కార్యదర్శి కన్నెకంటి సత్యనారాయణ చారి, ఆయా సంస్థల నిర్వాహకులు దాసోజు శ్రీనివాస్, ఎస్ఎన్ చారి, సాగర్ల సత్తయ్య, ఆనంద్, పున్న అంజయ్య, కాసోజు విశ్వనాథం, బండారు శంకర్, మోత్కూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.