నకిరేకల్, అక్టోబర్ 24: అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలి ట శాపంగా మారుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతోంది. పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ధాన్యం తడిచిపోయి, మొలకలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కురుస్తున్న వర్షాలకు వడ్లకు మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పండించడం ఒక ఎత్తు అయితే.. పంటను అమ్మాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుందని రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ధాన్యం అమ్ముకోవడానికి అరిగోస..
నకిరేకల్ మండలంలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అరిగోస పడుతున్నారు. మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 7 కేంద్రాలు, ఎన్డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 4 కేంద్రాలు, ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో 2 కేంద్రాలు కలిపి మొత్తం 13 కేంద్రాలు ప్రారంభించారు. మరో 3 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంది. నోముల, వల్లభాపురం, ఓగోడు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చి 15 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా కేంద్రాలు ప్రారంభించకపోవడంతో అకాల వర్షాలకు రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వారం రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో..అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిచి ముద్దవుతోంది. సంబంధిత అధికారులు స్పందించడం లేదని, ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయడం లేదని, దురుసుగా సమాధానం ఇస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. 15 రోజుల నుంచి రైతులు కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అన్నదాతను తుఫాను కోలుకోలేని దెబ్బతీసింది.
ధాన్యం ఆరబెట్టే పరిస్థితి లేదు..
ముసురుతో ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. శుక్రవారం కురిసిన వర్షానికి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు టార్పాలిన్లు లేక చిరిగిన పట్టాలతో నానా ఇబ్బందులు పడ్డారు. ధాన్యం కుప్పల వెంట నిలిచిన నీటిని పారలతో తొలగించే పని లో నిమగ్నమయ్యారు. పలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోవడంతో వడ్లను ఎత్తుకునే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ ప్రభావంపై నాలుగు రోజుల ముందే వాతావరణ శాఖ హెచ్చరించినా మండలంలో రైతులకు మార్కెటింగ్, సివిల్ సప్లయ్, రెవెన్యూ, కోఆపరేటీవ్, వ్యవసాయ శాఖల అధికారులు సూచనలు చేయకపోవడం గమనార్హం. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని, అవసరమైన టార్పాలిన్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
నల్లగొండ అంతటా వర్షం
నల్లగొండ, అక్టోబర్ 24: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో పెద్దఎత్తున ధాన్యం తడిసింది. ఇప్పటికే నెల రోజులుగా జిల్లాలోని ఆయా కేంద్రాల్లో రైతులు ధాన్యం పోసి ఆరపోస్తుండగా పలు కొర్రీలతో సకాలంలో తూకం వేయకపోవటంతో రైతులు తీవ్ర వెతలు ఎదుర్కొంటున్నారు. తాజాగా శుక్రవారం కురిసిన వర్షంతో మరో పక్షం రోజులపాటు కేంద్రాల్లో వ్యధ పడాల్సిన పరిస్దితులు దాపురించాయి. శాలిగౌరారంలో అత్యధికంగా 93.5 మి.మీ. వర్షం కురవగా, తిప్పర్తిలో 54.0, అనుములలో 47.3, కేతెపల్లిలో 45.5, కనగల్‌లో 42.0, నార్కట్ పల్లిలో 39.5, అడవిదేవుల పల్లిలో 38.8, చండూర్లో 36.0, కట్టంగూర్‌లో 35.5, వేముల పల్లిలో 32.8, నకిరేకల్‌లో 32.0, మాడ్గులపల్లిలో 29.8, నిడమనూరులో 24.0, త్రిపురారంలో 20.0, నల్లగొండలో 14.3, చిట్యాలలో 12.8, మునుగోడులో 11.3, తిరుమలగిరిసాగర్‌లో 10.3, మిర్యాలగూడలో 6.3, దామరచర్లలో 4.3, మర్రిగూడలో 3.5, గుర్రంపోడ్లో 3.5 గుడిపల్లిలో 2.0 మి.మీ.వర్షం కురువగా మిగిలిన మండలాల్లో ఒక మి.మీ.వర్షం పడింది.
శాలిగౌరారంలో భారీ వర్షం.. అపార నష్టం
శాలిగౌరారం, అక్టోబర్ 24: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శాలిగౌరారం మండలంలో శుక్రవారం ఎడతెరపి లేకుండా మోస్త్త రు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని పలు గ్రామాల రైతులకు అపార నష్టం వాటిల్లింది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పం ట చేతికి అందివచ్చే సమయంలో మాయదారి వర్షం అతలాకుతలం చేసింది. రైతులు వరి పంట ను కోసి విక్రయించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకు రాగా తడిసి ముద్దయ్యాయి. మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యా ర్డ్‌లో ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. పలు గ్రామాల్లో వరి పైరు పూర్తిగా నేలమట్టమైంది. ఉద యం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇంటి నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
వర్షాలకు అతలాకుతలం
కేతెపల్లి, అక్టోబర్ 24: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ఆయా గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు నిల్వ చేసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల చుట్టూ నీళ్లు నిలవడంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. కొన్ని కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వరద తాకిడికి కొట్టుకుపోయింది. కోత దశకు వచ్చిన వరి పొలాలు నేలవాలాయి. ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి చేను మీదనే తడిసిపోయింది. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.