సూర్యాపేట, మే 19 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోకపోవడంతో లక్షన్నర మెట్రిక్ టన్నులకు పైగానే ధాన్యం కల్లాల్లో పేరుకుపోయి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు నెలల తరబడి పడిగాపులు కాసే దుస్థితి నెలకొంది. కొనుగోలు సెం టర్లలో పెద్ద ఎత్తున ధాన్యం మూలుగుతుండగా రైతులు ఆకాశం వైపు చూస్తూ వర్షం ఎప్పుడు వస్తుందోనని భయాందోళనలతో బిక్కుబిక్కుమంటున్నారు. ట్రాన్స్పోర్టు చేసేందుకు లారీలు రాకపోవడం, మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి కాకపోవడంతో జాప్యం జరుగుతోందని, ఇదే పరిస్థితి ఉంటే మరో నెల రోజులైనా కొనుగోళ్లు పూర్తి కాకపోవచ్చని పలువురు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అం టున్నారు. ఇదిలా ఉంటే కొన్ని చోట్ల పాత బస్తాలు, నాణ్యతలేని చిరిగిన బస్తాలు ఇస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోజంతా ఎండలు మండుతూ సాయంత్రానికి చల్లబడుతూ అక్కడక్కడ ఈదురు గాలులు, చిరు జల్లులు పడుతుండటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులు అరిగోస పడుతున్నారు. నెల రోజులుగా ధాన్యం రాసులపై టార్పాలిన్లు కప్పడం, తొలగించడం ఇదే తంతు కొనసాగుతోంది. అసలు ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా అనే సమాధానం చెప్పేవారే కరువయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఎక్కడా కొనుగోళ్ల ప్రక్రియ సవ్యంగా సాగడం లేదు. ఏ రైతును కదిలించినా ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెల దాటుతున్నా గన్నీ బ్యాగులు ఇవ్వరు… కాంటాలు వేయ రు..లారీలకు ఎత్తరు…తీరా ఎత్తి పంపిస్తే మిల్లుల వద్ద రోజుల తరబడి దిగుమతి చేయకపోవడంతో పాటు బస్తా ఒక్కింటికి ఐదు నుంచి పది కేజీలు కటింగ్ చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లాలో కాళేశ్వరం, నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో 12.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే సాగర్ ఆయకట్టు పరిధిలోని ధాన్యాన్ని పది శాతం కూడా కొనుగోలు చేయకపోగా కాళేశ్వరం పరిధిలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల మినహా చాలా వరకు కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం రాసులు కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లే లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 2.60 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయగా ప్రస్తుతం సెంటర్లలో లక్షన్నర మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం ఉన్నట్లు అధికారులు అంచనా.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రెండు నెలలు గడిచినా అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోళ్లు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. రైతులు నేరుగా మిల్లుల వద్దకు ధాన్యం తీసుకెళ్లి ఏదో ఒక ధరకు తెగనమ్ముకుంటే వెంటనే అన్లోడ్ అవుతుండగా కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లే ధాన్యపు లోడ్లు రోజుల తరబడి లారీలు మి ల్లుల వద్దే ఉంటున్నాయి. దీంతో రెండు నెల లు పూర్తయినా సూర్యాపేట,తుంగతుర్తి నియోజకవర్గాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ధాన్యం ఇంకెప్పుడు కొంటరు..వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే కొనుగోళ్లు పూర్తి చేస్తరా లేదా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.
అసలే కొనుగోళ్లు వేగంగా జరుగకపోగా చాలా చోట్ల నాణ్యతలేని పాత బస్తాలను పంపిస్తున్నారు. నిబంధనల ప్రకారం కొత్త వాటిని పంపించాల్సి ఉండగా అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై పాత బస్తాలను పంపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా యి. ఇప్పటికే చాలా చోట్ల చిరిగిన బస్తాలు సరఫరా చేస్తున్నారు తాజాగా అర్వపల్లి మండలం సూర్యానాయక్ తండా కొనుగోలు కేంద్రంలో చిరిగిన, పాతబస్తాలను సరఫరా చేయడంతో రైతులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఆ సెంటర్కు 25 వేల బస్తాలు వస్తే 15వేలు పాతవి, చిరిగినవే ఉన్నాయి. దీంతో కొనుగోళ్లు నిలిచిపోయినట్లు సమాచారం.
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి నెల పదిహేను రోజులైంది. ప్రభు త్వం ఉందా లేదా… అధికారులు ఉన్నరా… నిద్రపోతున్నరా… రైతుల పట్ల మీరు అవలంబించే విధానం చూస్తుంటే అసలు మీరు మనుషులా..రాక్షసులా అనేది తెలియడం లేదు. వ్యవసాయం చేయొద్దని అంటే ఊకుం టం. గీమాత్రం సహకారం ప్రభుత్వం నుంచి లేకుంటే ఏం చేయాలి… కుటుంబాన్ని, ఇంటికాడ బర్లు, గొర్లు అన్నింటినీ వదిలి సెంటర్ల చుట్టూ తిప్పించుకుంటున్నరు… అసలు అధికారులు అన్నీ మరిచి తాగి పండుకుంటున్నరా.. లేక రైతులం తాగి పండుకోవాల్నా. ఇదేమన్న పరిపాలనా.. ఇప్పటికైనా వడ్లను కొనుగోలు చేయాలి.
– రాంచందర్, రైతు