ఆరుగాలం కష్టించి పంట పండించిన అన్నదాతకు మార్కెట్లో ప్రభుత్వం మద్దతుగా నిలుస్తున్నది. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 256 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లే కొనుగోలు చేస్తున్నది. ఎక్కడా అవాంతరాల్లేకుండా, రైతన్నకు అవస్థలు ఎదురవకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరిస్తుండడంతో కొనుగోళ్లు చివరి దశకు చేరకున్నాయి. వానకాలం సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 43,884 మంది రైతుల నుంచి 2.49లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. 511.84కోట్ల రూపాయలకు గానూ 476.66 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. 238 కేంద్రాల్లో ఇప్పటికే నూరు శాతం కొనుగోళ్లు కాగా, మిగతాచోట్ల ఈ వారం చివరికి పూర్తికానున్నట్లు అధికారులు తెలిపారు.
సూర్యాపేట, డిసెంబర్ 21 : జిల్లాలో వానకాలం ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ నెల 25వ తేదీ నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి కేంద్రాలను మూసి వేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో వానకాలం సీజన్లో 4,67, 082 ఎకరాల్లో వరి సాగైంది. దాంతో సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నదనే అంచనాతో 6.11 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రణాళికలు సిద్ధ్దం చేశారు. ఇందుకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా 256 కేంద్రాలు ఏర్పాటు చేసి ఆయా కేంద్రాల ద్వారా 45 రోజులుగా సు మారు 43,884 మంది రైతుల నుంచి 2,49,510.920 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో ఐకేపీ కేంద్రాలు ద్వారా 1,68,320.240 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 80,950.960 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. దీనికి సంబంధించి రూ.511.84 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.
సేకరించిన ధాన్యంలో 93 శాతం జిల్లాలో కేటాయించిన మిల్లులకు తరలించారు. 6.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యంగా కొనుగోళ్లు ప్రారంభించిన కేవలం 2.48 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఇందుకు రైతులు అత్యధికంగా సన్నాలు వేయడం బహిరంగ మార్కెట్లో మద్దతు ధర అధికంగా రావడం కారణం కాగా రైతు అవసరాలకు ఉంచడం, వినియోగదారులు సైతం నేరుగా అవసరాల కోసం రైతుల నుంచి కొనుగోలు చేయడంతో కొనుగోళ్లు చాలా తగ్గిపోయాయి. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలో అత్యధికంగా గ్రేడ్-1 మద్దతు ధర రూ. 2,060లు 98 శాతం మద్దతు ధర వచ్చింది.
ఈ నెల 25 నాటికి కేంద్రాలు మూసివేత
ఈ నెల 25 నాటికి కొనుగోలు కేంద్రాలను అధికారికంగా మూసీ వేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. కోదాడ , హుజూర్నగర్ నియోజక వర్గాల్లో కేంద్రాలు మూసీవేయగా కేవలం సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాల్లో మాత్రమే సెంటర్ నడుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 256 కేంద్రాలు ఏర్పాటు చేయగా 238 సెంటర్లు మూసి వేయగా కేవలం 18 కేంద్రాలు మాత్రమే కొనుగోళ్లు చివరి దశలో కొనసాగుతున్నది.
వేగంగా చెల్లింపులు
ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే చెల్లింపులు సైతం వేగంగా జరుగుతున్నాయి. కేంద్రం నిర్వాహకులు ట్యాబ్ ఎంట్రీ చేసి డీఎం ఆఫీస్‌లో అందిం చిన వెంటనే రైతులకు నాలుగైదు రోజుల్లో నగదు ఖాతాల్లో జమ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 43,884 మంది రైతుల నుంచి రూ.511.84 కోట్ల ధాన్యం సేకరించగా ఇప్పటి వరకు 38,3877 మంది రైతుల ఖాతాల్లో రూ.476.66 కోట్లకు పైగా చెల్లింపులు చేశారు. కేవలం 5,497 మంది రైతులకు రూ. 35.17 కోట్లు చెల్లించాల్సి ఉంది. కేంద్రాలు మూసీ వేత నాటికి రైతులందరికీ చెల్లింపులు పూర్తి చేసే విధంగా అధికారులు ముందస్తు ప్రణాళిక చేస్తున్నారు.
చెల్లింపులు పూర్తి చేస్తాం
ఈ నెల 25 నాటికి చివరి గింజ వరకు కొనుగోలు చేసి కేంద్రాలను మూసీ వేస్తాం. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోలు చేశాం. రైతులకు సైతం వెంటనే నగదు చెల్లింపులు చేస్త్తూ వచ్చాము. కేవలం 35.17 కోట్లు మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఈ వారంలో పూర్తి స్థాయిలో చెల్లింపులు చేస్తాము.
– రాంపతినాయక్, డీఎం, సివిల్ సప్లయ్ సూర్యాపేట