నేరేడుచర్ల , మార్చి 21 : ప్రస్తుతం వరి కోతలు సీజన్ ప్రారంభమవుతున్నది. బోర్లు, బావులు కింద ముందుగా నాట్లు వేసిన రైతులు కోతలపై దృష్టి సారించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నాట్లు వేసినప్పటికీ కోతల దశకు చేరుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో మొత్తం 6.94.566 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, వాటిలో 4.84.025 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు తెలిపారు. యాసంగిలో కూడా జిల్లాలో అత్యధిక శాతం మంది రైతులు వరి సాగు చేశారు. అయితే వరి కోతలు, కోతల అనంతరం నాణ్యమైన ధాన్యాన్ని పొందేందుకు మెలకువలు పాటించాలి.
వెన్ను 80-90 శాతం పసుపు రంగుల్లో మారుతున్న సమయంలో పంట కోయాలి. పంట పూర్తిగా ఎండిపోయే వరకు ఉండరాదు. ఈ దశలో గింజల్లో సుమారు 18-20 శాతం తేమ ఉంటుంది.
ఎక్కువ కాలం చేను మీద ఉంటే గింజలపై పగుళ్లు వచ్చి ధాన్యం నూకలయ్యే ప్రమాదం ఉంటుంది.
గింజల్లో తేమ శాతాన్ని తగ్గించేందుకు వరి పసలను 2-3 రోజులు చేనుపై ఎండనివ్వాలి. ఆ సమయంలో వర్షం కురిస్తే 5 శాతం ఉప్పు ద్రావణాన్ని తనల మీద పిచికారీ చేయాలి.
హార్వెస్టర్‌తో కోత, నూర్పిడి చేస్తే చెత్త, దుమ్మ, మటిపెడ్డలు వంటివి ధాన్యంలో కలవకుండా జాగ్రత్త పడవచ్చు.
హార్వెస్టర్‌తో పంట కోసినప్పుడు రెండు వేర్వేరు రకాల ధాన్యం కలవకుండా జాగ్రత్త పడాలి.
నూర్పిళ్ల సందర్భంగా వరిని శుభ్రంగా తూర్పారపట్టి చెత్త, మట్టి వంటి వాటిని వేరు చేయాలి.
తూర్పారపట్టిన వరిలో తేమ శాతం 12-14 శాతానికి తగ్గేలా ఆరబెట్టాలి. ధాన్యం ఎక్కవ రోజలు నిల్వ ఉంటుంది.
సరైన తేమ శాతం వచ్చే వరకు ఆరబెడితే ధాన్యం నూకలయ్యే అవకాశాలు తగ్గుతాయి.
చౌడు నేలల్లో పండించిన ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలపరాదు.
చీడపీడలు ఆశించిన, రంగు మారిన ధాన్యన్ని మంచి ధాన్యంలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కలుపు మొక్కల గింజలు లేకుండా చూసుకోవాలి.
మబ్బులతో కూడిన వాతావరణం ఉండి చిరుజల్లు కురుస్తున్నందున కల్లాల్లో ఉన్న ధాన్యం కుప్పలను టార్పలిన్ కవర్లు, వరి గడ్డిని మందగా పరిచి తడవకుండా జాగ్రత్త పడాలి.
ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు అధిక తేమ లేకుండా చూసుకోవాలి.
ధాన్యాన్ని ఆశించే కీటకాల నుంచి రక్షణ కోసం పొగబెట్టడం మంచిది.
గోనె సంచులు, గుమ్ముల్లో ధాన్యం నిల్వ చేయాలి. ఎలుకలు, సూక్ష్మ జీవులు ఆశించకుండా చూడాలి.
సాగులో అధికారుల సలహాలు సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. జిల్లాలో వరి కోతలు ప్రారంభమైనందున కోత సమయంలో పంట ఏ దశలో ఉందో చూసిన తరువాతనే కోతలు ప్రారంబించాలి