సూర్యాపేట, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాలో గత ఐదారు రోజులుగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. కొనుగోలు కేంద్రాల కోసం రెండు సార్లు సమావేశాలు పెట్టిన అధికారులు వెంటనే ప్రారంభించకుండా గాలికొదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలతో పాటు సూర్యాపేట నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేట్ వారికే విక్రయిస్తున్నారు.
ప్రభుత్వం మద్దతు ధరకు విక్రయించుకునే వీలు కల్పించకపోవడంతో గత్యంతరం లేక రైతులు తమ ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్లు, మిల్లులకు తరలిస్తుండగా, తరుగు పేరిట కిలోల కొద్దీ దోపిడీ చేస్తున్నారు. దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది. గత రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలతో రైతాంగం పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. పంటలకు నీరు కరువైంది. కాళేశ్వరం ఆయకట్టులో వరి ఎండుతున్నది.
నానా ఇబ్బందులు పడి పండించిన పంటను ఎలా అమ్ముకోవాలో తెలియక రైతులు ఆయోమయానికి గురవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వద్దనేంత వరకు నీళ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, సకాలంలో ఎరువులు, విత్తనాలతో పాటు పంట పెట్టుబడి సాయం అందించి వ్యవసాయాన్ని పండుగలా చేశారు. అంతే కాకుండా రైతులకు ట్రాన్స్‌పోర్టు ఖర్చులు కూడా లేకుండా గ్రామ గ్రామాన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, చివరి గింజ వరకూ కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించింది. అలాంటిది నేడు అసలు కొనుగోలు కేంద్రాలే కనిపించడం లేదు.
జోరుగా కోతలు.. కనిపించని కొనుగోలు కేంద్రాలు
సాగర్ ఆయకట్టు పరిధిలోని కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో గత ఐదారు రోజులుగా వరి కోతలు జరుగుతున్నాయి. కాళేశ్వరం పరిధిలోని గోదావరి జలాల కింద ఆయకట్టు ప్రాంతమైన తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో కోతలు కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతాయి. అయితే జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో గత్యంతరం లేక తమ ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో కోత కోసిన ధాన్యాన్ని మిల్లులు, వ్యవసాయ మార్కెట్లకు తరలిస్తున్నారు.
అయితే అక్కడ మద్దతు ధర దక్కడం లేదు. సాగర్ ఆయకట్టులో అత్యధికంగా సన్న వడ్లు సాగు చేస్తుండగా ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ ఒక్కంటికి రూ.2389లు ఉండగా మిల్లుల వద్ద 2400 నుంచి 2500ల వరకు ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు. కానీ తేమ, తరుగు పేరిట బస్తా ఒక్కింటికి రెండు కిలోల తరుగు తీస్తున్నారని వాపోతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2389 తో పాటు బోనస్ 500లు కలిపి 2800ల వరకు వస్తుంది. ఈ లెక్కన రైతు ఏ స్థాయిలో నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే కొనుగోలు కేంద్రాల కోసమంటూ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటికైనా అధికారులు స్పం దించి వెంటనే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.