మిర్యాలగూడ/వేములపల్లి, నవంబర్ 10 : మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లుల వద్దకు ఒక్కసారిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి వరి ధాన్యం భారీగా తరలివచ్చింది. ధాన్యం లోడ్లతో రోడ్ల వెంట ట్రాక్టర్లు బారులు తీరాయి. ఆదివారం ఒక్కరోజే మిర్యాలగూడ రైస్ మిల్లులకు సుమారు 3వేల ట్రాక్టర్లకు పైగా ధాన్యం వచ్చింది. దీంతో కొనుగోలు ప్రక్రియ మందగించింది. కోదాడ రోడ్డు వైపు యాద్గార్పల్లి మిల్లుల్లో ఉదయం పూట శైలోలు నిండిపోవడంతో ఉదయం 11గంటల వరకు ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రోడ్లపైనే ట్రాక్టర్లను నిలిపి రాస్తారోకో చేశారు. అలాగే నల్లగొండ రోడ్డులో వేములపల్లి మండలం పరిధిలోని మిల్లులకు కూడా ధాన్యం ట్రాక్టర్లు భారీగా తరలివచ్చాయి. రోడ్డుపై ఒక ట్రాక్టర్ ప్రమాదానికి గురై రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో సుమారు 2గంటల పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది.
మరోవైపు ధాన్యాన్ని మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రాస్తారోకో చేశారు. అనంతరం రోడ్డుపై ప్రమాదానికి గురైన ట్రాక్టర్ను అద్దంకి- నార్కట్పల్లి రహదారి అధికారులు తొలగించారు. తాసీల్దార్ కోటీశ్వరి, పోలీసులు రాస్తారోకో వద్దకు వెళ్లి రైతులకు నచ్చజెప్పి గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు. మహీంద్ర, పద్ద చింట్లు రకాలైన ఎర్ర రకం ధాన్యానికి రూ.2,150 నుంచి రూ.2,250 వరకు ధరలు వేస్తున్నారని, మిల్లర్లు సిండికేట్గా మారి పలు సాకులు చూపుతూ తక్కువ ధర చెల్లిస్తున్నారని రైతులు యాద్గార్పల్లి మిల్లుల వద్ద, వేములపల్లి మండల పరిధిలోని మిల్లుల వద్ద ధర్నా చేశారు.
రైతుల ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని శనివారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మిర్యాలగూడ రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ కలిసి మూడు గంటలపాటు సమీక్ష నిర్వహించారు. సన్నరకం ధాన్యానికి రూ.2,320 నుంచి రూ.2,400 వరకు కొనుగోలు చేయాలని సూచించారు. రైస్ మిల్లర్లు వారు చెప్పిన దానికి అంగీకరించారు. కానీ ఆదివారం మిల్లుల వద్ద భారీగా ట్రాక్టర్లు బారులు తీరడంతో పచ్చి గింజ, తేమ శాతం అధికంగా ఉందని, ధాన్యం రంగు మారిందని పలు రకాల సాకులతో రూ.2,150 నుంచి రూ.2,350 వరకు కొనుగోలు చేశారు. కాగా ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ చెప్పినా రూ.2,300లోపు ధరకు చాలా ధాన్యం కొనుగోలు చేశారని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మిల్లర్లు గంటల వ్యవధిలోనే దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం రైస్ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించడంతోనే అధికారులు సరిపుచ్చుతున్నారని, క్షేత్ర స్థాయిలో మిల్లుల వద్ద ధాన్యం కొనుగోళ్లను పరిశీలించడం లేదని, దీని వల్లనే మిల్లర్లు ఆడిందే ఆటగా సాగుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా రైతుల శ్రేయస్సు కోసం అధికారులు క్షేత్ర పర్యటన చేసి రైతులకు మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
కష్టపడి పండించిన పంటను రెండు ట్రాక్టర్లలో యాద్గార్పల్లిలో ఉన్న మిల్లు వద్దకు తీసుకెళ్లినా. ధాన్యం నాణ్యతగా లేదని 2,150 రూపాయలకే కొన్నా రు. ఒకవైపు ప్రభుత్వం రూ.2,320 తగ్గొద్దని చెప్తున్నా కూడా అధికారులు, మిల్లర్లు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. రైతులకు మద్దతు ధర ఇప్పించేందుకు ఒక్క అధికారి కూడా మిల్లుల వద్దకు రావడం లేదు. దీనివల్లనే మిల్లర్లు నాణ్యత లేదనే సాకుతో ధరను తగ్గించి తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
-కె.సత్యనారాయణ, రైతు, రాయినిపాలెం, మిర్యాలగూడ మండలం
మిర్యాలగూడ పరిసర ప్రాంతాల మిల్లులకు ఆదివారం భారీగా ధాన్యం ట్రాక్టర్లు తరలివచ్చాయి. దాని వల్ల ఉదయం 10గంటల వరకు కొనుగోళ్లు కొంత మందగించాయి. మధ్యాహ్నం 1గంట వరకు రోడ్లపై ఉన్న అన్ని ధాన్యం ట్రాక్టర్లును కొనుగోలు చేశాం. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొస్తే 2,320 రూపాయలకు చెల్లిస్తున్నాం. ఇటీవల కురిసిన వర్షాలకు వరి పైరు నేలపై పడి ధాన్యం రంగు మారింది. అధికంగా పచ్చగింజ ఉంది. దీని వల్ల ధాన్యం నాసిరకంగా ఉందని వద్దు అంటే రైతులు గొడవకు దిగుతున్నారు.
-కర్నాటి రమేశ్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు