కట్టంగూర్, ఏప్రిల్ 12 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సీపీఎం పార్టీ కట్టంగూర్ మండల నాయకులు పాదయాత్ర చేపట్టారని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను శనివారం ఈదులూరు గ్రామంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో పాలకులు మారినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. మండలంలో అనేక విధాలుగా రైతులు, సాగు, తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. కాల్వలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఎస్ఎల్ సీ నుంచి వచ్చే నీరు సరైన పద్దతిల్లో రైతులకు అందడం లేదని, లిప్ట్ లు, మేజర్ కాల్వలను మరమ్మతులు చేస్తే 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసి అర్హులైన వారికి పింఛన్లు, ఇండ్ల స్థలాలు, రైతు భరోసా, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన అన్ని వంటలకు గిట్టుబాటు ధర కల్పించి బోనస్ ఇవ్వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ పేద ప్రజల నడ్డి విరుస్తున్నాయన్నారు.
జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. మండలంలో ఐదు రోజుల పాటు 132 కిలో మీటర్ల మేర సాగే పాదయాత్రకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. 15న నిర్వహించే తాసీల్దార్ కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేశ్, గంజి మురళీధర్, బొజ్జ చిన వెంకులు, రాచకొండ వెంకన్న, జట్ట సరోజ, మండల కార్యదర్శి పింజర్ల సైదులు, వంటెపాక వెంకటేశ్వర్లు, కుమ్మరి శంకర్. ఇటికాల సురేందర్, కట్ట బక్కయ్య, గుడుగుండ్ల రామకృష్ణ, చిలుముల రామస్వామి, మురారి మోహన్, గడగోజు రవీంద్రాచారి, జాల రమేశ్, ఊట్కూరి సుజాత, శ్రీను.. జాల అంజనేయులు, చిలుకూరి సైదులు, లక్ష్మయ్య, ముసుకు రవీందర్ పాల్గొన్నారు.