అక్షరాల గుడిలో.. ఔట్సోర్సింగ్ అంగడి!
ఉన్నత విద్యా నిలయమైన ‘మహాత్మా’లోని పలు విభాగాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం ఎంజీయూలో ఓ ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి అవకాశం కల్పించారు.
- లంచం ఇస్తే.. అర్హత లేకున్నా నియామకం
- రూ.99 లక్షల జీఎస్స్టీకి ఏజెన్సీ ఎగనామం
- మహాత్మాలో ఔట్సోర్సింగ్ కొలువుల అమ్మకం
- ఇష్టారాజ్యంగా ఏజెన్సీ ఉద్యోగల భర్తీలో రూ.లక్షల్లో వసూళ్లు
- అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విద్యార్థుల వినతి
- రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌కూ విజ్ఞప్తి
రామగిరి, మే 21: ఉన్నత విద్యా నిలయమైన ‘మహాత్మా’లోని పలు విభాగాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం ఎంజీయూలో ఓ ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి అవకాశం కల్పించారు. ఆ ఏజెన్సీ నిర్వాహకుడు మాత్రం నిరుద్యోగల ఆశలను పెట్టుబడిగా మార్చుకొని అర్హత, ప్రతిభను పక్కనబెట్టి… అడిగినంత ముడుపులు ఇచ్చుకున్న వారికే కొలువులు కట్టబెడుతూ రూ.కోట్ల దందా సాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆ ఏజెన్సీ ద్వారా 39 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రస్తుతం తీవ్ర వివాస్పదంగా మారింది. గతంలో ఇదే ఏజెన్సీ పోస్టుల భర్తీలో రోస్టర్ తదితర అంశాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా భర్తీ చేసే ప్రక్రియలో విద్యార్థి సంఘాల ఆందోళనతో నోటిఫికేషన్ రద్దు చేశారు. ప్రస్తుత పోస్టుల భర్తీలో అదే విధానం కొనసాగిస్తూ ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై వీసీ, రిజిస్ట్రార్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఈ నెల 26న కలెక్టర్‌ను కలిసి వర్సిటీ బీఆర్ఎస్వీ, ఇతర విద్యార్థి సంఘాల నేతలు వినతిప్రతం అందజేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డికి వినతిప్రతం అందజేశారు.
నిబంధనలు బేఖాతర్
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ వ్యవహారం తీవ్ర వివాస్పదంగా మారింది. జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టోర్ కీపర్, అటెండర్ తదితర 39 పోస్టుల భర్తీలో నిబంధనలను బేఖాతర్ చేస్తూ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఒక ఉద్యోగానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసి భర్తీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై వర్సిటీ అధికారులు మౌనం పాటిస్తుండటంతో వారి పాత్ర కూడా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఔట్సోర్సింగ్లోకి మార్పు
ఎంజీయూలో గతంలో దినసరి కూలీలుగా పలు విభాగాల్లో కొందరు పనిచేశారు. వీరిని అప్పటి ఇన్చార్జి వీసీ నవీన్మిఠల్ తొలగించారు. వారిని ప్రస్తుత అధికారులు ఎలాంటి నోఫికేషన్ లేకుండానే ఔట్సోర్సింగ్ విధానంలోకి మార్చి ఉద్యోగులుగా కొనసాగిస్తున్నారు. ఓవైపు ఏజెన్సీలు… మరోవైపు వర్సిటీ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడిపిస్తూ నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
రూ.99 లక్షల జీఎస్టీకి ఎగనామం
ఎంజీయూలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ కోసం పని చేస్తున్న నకిరేకల్‌కు చెందిన ఓ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ రూ.99 లక్షల జీఎస్టీని ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగనామం పెట్టిన అంశం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి 18 శాతం (వర్సిటీ 2 శాతం, ఏజెన్సీ 16 శాతం) జీఎస్టీ చెల్లించాలి. వర్సిటీ రెగ్యులర్‌గా జీఎస్టీ చెల్లించినా ఆ ఏజెన్సీ 16 శాతం జీఎస్టీ చెల్లించడం లేదు. ఈ విషయంపై వర్సిటీ అధికారులు స్పందించకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. రెండు నెలలుగా ఔట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో వర్సిటీ ఉన్నతాధికారులకు వాటా ఉండటంతోనే నోరు మెదపడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
రోస్టర్ విధానానికి తిలోదకాలు
నిబంధనల ప్రకారం ఎంప్లాయిమెంట్ కార్డులున్న సీనియర్ నిరుద్యోగులను రోస్టర్ విధానాన్ని అనుసరించి మాత్రమే మెరిట్ ఆధారంగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ ఏజెన్సీ నిర్వాహకులు ప్రభు త్వం, యూనివర్సిటీ మార్గదర్శకాలను తుంగలో తొక్కి కనీసం అభ్యర్థుల ప్రతిభను పరీక్షించకుండా ఏకపక్షంగా నియామకాలు పూర్తి చేశారని విశ్వసనీయ సమాచారం. దీంతో అన్ని అర్హతలున్నా లంచం ఇస్తేనే ఉద్యోగం దక్కే దుస్థితి దాపురించిందనే ఆరోపణలున్నాయి. ఇదే అంశంపై గతంలో పోరాటాలు చేసిన విద్యార్థులపై కేసులు పెడుతున్న వర్సిటీ అధికారులు ఈ అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలకు పాతర
ఎంజీయూలో ఏజేన్సీ నిర్వాహకులు ఎలాంటి రోస్టర్, మెరిట్, రాత పరీక్షలు నిర్వహించకుండానే ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు. ఈ విషయంపై వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. అధికారులను ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతూ యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తూ, బైండోవర్ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ఈ నెల 26న నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు, ఈ నెల 29న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశాం.
– వాడపల్లి నవీన్, ఎంజీయూ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు
అర్హతున్న ఏజెన్సీకి నియామక ప్రక్రియ
అన్ని అర్హతలున్న నల్లగొండకు చెందిన భార్గవి ఏజెన్సీకి ఎంజీయూలో వివిధ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అప్పగించాం. అన్ని అర్హులున్న అభ్యర్థులను పోస్టులవారీగా ఎంపిక ప్రక్రియను ఏజెన్సీ చేసి మాకు అప్పగిస్తుంది. ఉద్యోగాల భర్తీలో వస్తున్న ఆరోపణలతో యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. ఏజెన్సీ నుంచి వచ్చిన అభ్యర్థుల సర్వీసు సక్రమంగా లేకపోతే తిరిగి పంపిస్తాం. ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– కొప్పల అంజిరెడ్డి, ఎంజీయూ రిజిస్ట్రార్
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

